ఆప‌ద్భాంధ‌వుడిని మ‌ర్చిపోలేదింకా!

ఆపద్భాంధవుడు - ఆజ్ కా గూడరాజ్ అనే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి ఇటీవల చిరుతో న‌టించిన‌ప్ప‌టి త‌న పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లింది.;

Update: 2024-04-14 17:30 GMT

మెగా స్టార్ చిరంజీవిని ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌తో సత్కరించింది. PM మోడీ BJP నేతృత్వంలోని NDA సంకీర్ణం నుంచి ద‌క్కిన వ‌రం ఇది. ఒక‌ ఐకాన్‌గా ఇటీవ‌ల‌ చిరంజీవి స్థాయి మరింత బలంగా పెరిగింది. అయితే తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వ‌భావం క‌ల‌వాడు.. అందుకే చాలా మంది నటీమణులు అతడితో మ‌ళ్లీ మ‌ళ్లీ పని చేయడానికి తమ అభిమానాన్ని ఆత్రుతను తెలియ‌జేస్తుంటారు. గ‌తంలో ప‌ని చేసిన నాయిక‌లు ఇప్పుడు చిరుతో ప‌ని చేయాల‌ని క‌ల‌లు కంటున్నారు.

 

ఆపద్భాంధవుడు - ఆజ్ కా గూడరాజ్ అనే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ బాలీవుడ్ నటి మీనాక్షి శేషాద్రి ఇటీవల చిరుతో న‌టించిన‌ప్ప‌టి త‌న పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్లింది. చిరంజీవిని తన అభిమాన నటుడని, ఆయన బహుముఖ ప్రజ్ఞను, స్టార్‌డమ్‌ని కొనియాడుతూ చిరంజీవిపై తనకున్న ఫ్యానిజాన్ని చాటుకుంది. రెండు చిత్రాలలో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసాన‌ని గుర్తుచేసుకుంది. చిరంజీవి అసాధారణమైన ప్రతిభను కొనియాడుతూ.. అతడితో కలిసి పనిచేయడం తనకు లభించిన అదృష్టం అని హైలైట్ చేసింది. తెలుగులో ఆపద్భాంధవుడు, హిందీలో ఆజ్ కా గుండారాజ్ చిత్రాల్లో చిరుతో న‌టించాన‌ని మీనాక్షి తెలిపింది.

1992లో క‌ళాత‌ప‌స్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'ఆపద్భాంధవుడు' విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఐదు నంది అవార్డులు గెలుచుకున్న చిత్ర‌మిది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వ‌చ్చింది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శిత‌మైంది. తరువాత తమిళంలో 'వీర మరుదు'గా డబ్ అయి విడుద‌లైంది.

ఆజ్ కా గూడరాజ్ .. చిరంజీవి న‌టించిన‌ రెండవ బాలీవుడ్ చిత్రం. తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ గ్యాంగ్ లీడర్ కి హిందీ రీమేక్ ఇది. అక్క‌డా మంచి ఆదరణ పొందింది. ఆ సంవత్సరంలో హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 8వ చిత్రంగా నిలిచింది. తాజా ఇంట‌ర్వ్యూలో చిరంజీవిని మీనాక్షి శేషాద్రి ప్రశంసించడం అభిమానులను ఆనందపరిచింది. త‌న‌ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవిపై నాటి మేటి న‌టీమ‌ణికి ఉన్న‌ అభిమానం ఇన్నేళ్ల త‌ర్వాతా చెక్కు చెద‌ర‌లేదంటే ఆయ‌న స్థాయిని గొప్ప‌తానాన్ని అర్థం చేసుకోవాలి.

Tags:    

Similar News