శేష్ మీద పెద్ద బరువే
సక్సెస్ రేట్ పది శాతం లోపు ఉండే ఇండస్ట్రీలో 100 శాతం గెలుపుతో ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.;
సక్సెస్ రేట్ పది శాతం లోపు ఉండే ఇండస్ట్రీలో 100 శాతం గెలుపుతో ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు. అది ఒక దర్శకుడికి కావచ్చు.. ఒక నిర్మాతకు కావచ్చు.. ఒక హీరోకు కావచ్చు. సక్సెస్‌ను నిలబెట్టుకుంటూ సాగడం చాలా చాలా కష్టం. ఐతే అడివి శేష్.. చాలా ఏళ్ల నుంచి ఈ అరుదైన జాబితాలో కొనసాగుతున్నాడు. హీరోగా నటించిన తొలి చిత్రం ‘క్షణం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అతను.. ఆ తర్వాత కూడా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ విజయాలు సాధిస్తున్నాడు.
గూఢచారి, ఎవరు, మేజర్, హిట్-2.. ఇలా అతను లీడ్ రోల్ చేసిన ప్రతి సినిమా హిట్టే. హిట్-2ను మినహాయిస్తే ప్రతి సినిమాలోనూ శేష్ రైటింగ్, మేకింగ్ పరంగానూ బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. తన కొత్త చిత్రం ‘డెకాయిట్’కు కూడా కథ అందించడమే కాక.. స్క్రీన్ ప్లేలోనూ అతను భాగమయ్యాడు. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. దీంతో ‘డెకాయిట్’ కూడా బాగుంటుందనే నమ్మకంతో ఉన్నారు తన అభిమానులు. ఐతే ఇప్పటిదాకా వచ్చిన చిత్రాలతో మెప్పించడం వేరు.. ఇప్పుడు హిట్టు కొట్టడం వేరు.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగా లేదు. సినిమాలకు మంచి టాక్ వస్తున్నా.. వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. స్టార్లు నటించిన సినిమాలకు కూడా వీకెండ్ తర్వాత ఆక్యుపెన్సీలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వారాంతం తర్వాత ఎలా చతికిలపడిందో తెలిసిందే. గత వీకెండ్లో వచ్చిన ‘బైకర్’ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని కూడా నిలబడలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘డెకాయిట్’ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి.. దానికి టాక్ ఎలా ఉంటుంది.. వీకెండ్ తర్వాత సినిమా ఏమేర నిలబడుతుంది అని ట్రేడ్ ఎంతో ఆసక్తిగా చూస్తోంది. శేష్ సినిమా అంటే నమ్మకంతో గత చిత్రాలకు వచ్చినట్లే ఈ సినిమా చూడడానికి కూడా జనం అదే స్థాయిలో వస్తారా అన్నది ప్రశ్న.
ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి అనిపించే స్థాయిలో లేవు. తీసిపడేసేలా కూడా లేవు. ‘బైకర్’ చిత్రంతో పోలిస్తే మాత్రం బెటరే. పరిస్థితి ఆశాజనకంగా ఉంది. శేష్ సినిమా అంటే బలమైన కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని అతను నిలబెట్టుకోగలడా అన్నదే ఇప్పుడు కీలకం. సినిమాకు ఓ మోస్తరు టాక్ వస్తే సరిపోదు. సూపర్ అనే మాట వినిపించాలి. అప్పుడే వీకెండ్లో మంచి ఓపెనింగ్స్ రావడమే కాక.. ఆ తర్వాత కూడా సినిమా నిలబడుతుంది. ఈ సినిమా మీద ఏకంగా రూ.70 కోట్ల బడ్జెట్ పెట్టగా.. బిజినెస్ కూడా బాగానే జరిగింది. కాబట్టి కలెక్షన్లు చాలా గొప్పగా ఉంటేనే సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది. మరి శేష్ తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లతో బాక్సాఫీస్ సవాలును ఛేదిస్తాడేమో చూడాలి.