త‌న‌యుడి సినిమా క్లైమాక్స్ మార్చేసిన హీరో!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్య‌వ‌హరిస్తున్నారు.;

Update: 2026-04-09 11:30 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్య‌వ‌హరిస్తున్నారు. తొలి సినిమా `మ‌హారాజ్` ఆశించిన స్థాయిలో రాణించ‌క‌పోవ‌డంతో రెండ‌వ సినిమా విష‌యంలో ఎలాంటి త‌ప్పి దాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో అమీర్ ఖాన్ స్వయంగా `ఏక్ దిన్` క్లైమాక్స్‌ను మార్చి ఆ సన్నివేశాలను ఆయనే దగ్గరుండి డైరెక్ట్ చేశారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దర్శకుల పనిలో జోక్యం చేసుకోని అమీర్ కుమారుడి సినిమా విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జునైద్ ఖాన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ఈ చిత్రం థాయ్ మూవీ `వన్ డే`కు రీమేక్. ఈ సినిమా రషెస్ చూసిన అమీర్ ఖాన్ ఒరిజినల్ వెర్షన్ కంటే క్లైమాక్స్ ఇంకా ఎమోషనల్‌గా ఉండాలని భావించారు. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తుండగా, అమీర్ ఖాన్ సోదరుడు మన్సూర్ ఖాన్ నిర్మాణ పర్యవేక్షణ చూస్తున్నారు. అయితే క్లైమాక్స్ సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అమీర్ రంగంలోకి దిగి ఆ సీన్లను స్వయంగా రీ-రైట్ చేసి చిత్రీకరించినట్లు సమాచారం.

అమీర్ ఖాన్‌కు సినిమా స్క్రిప్ట్ , ఎడిటింగ్‌పై మంచి అవగాహన ఉంది. గతంలో కూడా ఆయన తన నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలకు సృజనాత్మక సహకారం అందించారు. దర్శకుడు సునీల్ పాండేతో చర్చించిన తర్వాతే ఆయన ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ మార్పుల విషయంలో దర్శకుడు , అమీర్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు సినిమా అవుట్‌పుట్ కోసం అందరూ అమీర్ నిర్ణయానికే మొగ్గు చూపారు. ముఖ్యంగా సాయి పల్లవి వంటి ప్రతిభావంతురాలైన నటి ఈ సినిమాలో ఉండటం వల్ల ఆమె నటనకు తగ్గట్టుగా క్లైమాక్స్ బలంగా ఉండాలని అమీర్ భావించారు.

తండ్రిగా కొడుకు సినిమాను ప్రమోట్ చేయడమే కాకుండా క్రియేటివ్ వైపు కూడా అండగా నిలవడం అమీర్ ఖాన్ ప్రత్యేకత. ఏక్ దిన్ మే 1 విడుదల కానుంది. సాయి పల్లవికి ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై అంచనాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ స్వయంగా క్లైమాక్స్ డైరెక్ట్ చేశారనే వార్త సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. థాయ్ వెర్షన్‌లోని ఆత్మను దెబ్బతీయకుండా ఇండియన్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా అమీర్ చేసిన మార్పులు వెండితెరపై ఎలా పండుతాయో చూడాలి.

పరిశ్రమలో నెపోటిజం గురించి చర్చ జరుగుతున్న సమయంలో అమీర్ ఖాన్ తన కొడుకుకు కేవలం అవకాశాలు ఇవ్వడమే కాకుండా? అతని కంటెంట్ నాణ్యతను కూడా స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. ఇది జునైద్ ఖాన్ కెరీర్‌కు ఎంతవరకు మేలు చేస్తుందో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా? మిస్టర్ పర్ఫెక్ట్ వేలు పడిందంటే ఆ సన్నివేశం ఖచ్చితంగా ప్రేక్షకుల గుండెలను హత్తుకుంటుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

Tags:    

Similar News