చిరు, పవనే కాదు.. చరణ్ ఇప్పుడు కూడా..
సినిమా హిట్ అయితే హీరోలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మాతలకు అండగా నిలవడం మాత్రం కొద్దిమంది స్టార్ హీరోలకే సాధ్యమవుతుంది.
సినిమా హిట్ అయితే హీరోలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మాతలకు అండగా నిలవడం మాత్రం కొద్దిమంది స్టార్ హీరోలకే సాధ్యమవుతుంది. టాలీవుడ్ లో అలాంటి సందర్భాలు గతంలో ఎన్నో కనిపించాయి. ముఖ్యంగా మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ఆ విషయంలో తరచూ వినిపిస్తుంటాయి. ఇప్పుడు అదే జాబితాలో మరోసారి రామ్ చరణ్ పేరు చేరింది.
సాధారణంగా ఒక హీరో సినిమా కోసం అగ్రిమెంట్ ప్రకారం రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సినిమా విడుదలైన తర్వాత దాని రిజల్ట్ తో వారికి పెద్దగా సంబంధం ఉండదు. కానీ కొందరు హీరోలు మాత్రం నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో పడితే తమ వంతు బాధ్యతగా భావించి ముందుకు వస్తుంటారు. మెగా కుటుంబానికి చెందిన హీరోల విషయంలో ఇలాంటి ఉదాహరణలు గతంలో చాలా వినిపించాయి.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయిన సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమ పారితోషికంలో పెద్ద మొత్తాన్ని వెనక్కి ఇచ్చారని ప్రచారం జరిగింది. అలాగే అజ్ఞాతవాసి సినిమా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతలకు అండగా నిలిచారనే వార్తలు అప్పట్లో ప్రముఖంగా వినిపించాయి.
ఇప్పుడు రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా విషయంలో కూడా అలాంటి చర్చ జరుగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఆ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న విడుదలై మంచి స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
అయితే సినిమా కలెక్షన్లు బాగున్నప్పటికీ, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రాజెక్ట్ కావడం, రెవెన్యూ షేరింగ్ కు సంబంధించిన కొన్ని లెక్కలు కారణంగా నిర్మాతలపై ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు పూర్తిగా సేఫ్ జోన్ లోకి రావాలని భావించిన చరణ్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని వదులుకున్నారని ప్రచారం జరుగుతోంది.
రామ్ చరణ్ విషయంలో ఇది కొత్త విషయం కాదని కొందరు ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. 2010లో విడుదలైన ఆరెంజ్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో నిర్మాతగా ఉన్న నాగబాబు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తన బాబాయ్ కు అండగా నిలిచేందుకు చరణ్ తన పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇచ్చేశారనే ప్రచారం కూడా జరిగింది.
పెద్ది కోసం చరణ్ దాదాపు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ మొత్తంలో కొంత భాగాన్ని వదులుకున్నారనే టాక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కమర్షియల్ లెక్కల కంటే సినిమా, నిర్మాతలపై ఉన్న బాధ్యతలు చరణ్ నిర్ణయం తీసుకున్నారని చర్చ సాగుతోంది. అయితే ఆ వ్యవహారంపై మూవీ టీమ్ లేదా నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ చిరు, పవన్ బాటలో చరణ్ కూడా నిర్మాతలకు అండగా నిలిచారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.