పెద్ది 'స్పెషల్' సాంగ్.. అసలు లాజిక్ మిస్ అవుతున్నారా?
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.;
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఆ ఐటెం సాంగ్ కోసం చిత్రబృందం చాలా కాలంగా సరైన హీరోయిన్ కోసం వెతుకుతోంది. సాధారణంగా ఇలాంటి పాటలు చిత్రీకరణ చివరి దశలో రూపొందిస్తారు కాబట్టి, అప్పటి వరకు అందుబాటులో ఉన్న హీరోయిన్ తో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.
మొన్నటి వరకు ఆ పాట కోసం క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు గట్టిగా వినిపించగా.. ఇప్పుడు ఆయేషా ఖాన్, మానస వారణాసి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీరిలో మృణాల్ కు కాస్త ఫేమ్ ఉన్నా.. మిగతా ఇద్దరూ టాప్ స్టార్ హీరోయిన్లు కాకపోవడం అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ కు కూడా స్టార్ హీరోయిన్లనే ఎంపిక చేస్తున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే, ఆ పాటలో కనిపించే హీరోయిన్ కు కూడా స్పెషల్ రేంజ్ లో ఉండాలని అభిమానులు భావిస్తారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు ఆ స్థాయికి సరిపోవట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ది లాంటి భారీ ప్రాజెక్ట్ కు అవసరమైతే ఎలాంటి స్టార్ హీరోయిన్ నైనా తీసుకురావడం పెద్ద విషయం కాదని అభిమానులు భావిస్తున్నారు.
అయినప్పటికీ ఆ దిశగా మేకర్స్ నుంచి పెద్దగా ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా ఐటెమ్ సాంగ్ హిట్ అవ్వాలంటే మంచి ట్యూన్ తో పాటు ఆ పాటలో కనిపించే హీరోయిన్ గ్లామర్, ప్రెజెన్స్ కూడా చాలా ముఖ్యమని అభిమానులు అంటున్నారు. ఆ విషయంలో మేకర్స్ లాజిక్ మిస్ అవుతున్నారేమో అన్న చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆ పాటలో నటించే హీరోయిన్ ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ షూటింగ్ ను తాత్కాలికంగా వాయిదా వేసి, గుజరాత్ లో అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు జామ్‌నగర్ కు వెళ్లారని తెలుస్తోంది.
అయితే స్పెషల్ సాంగ్ చిత్రీకరణ వచ్చే వారం ప్రారంభం కావొచ్చని సమాచారం. ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సనా చెన్నైలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో కలిసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై పని చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. పెండింగ్ లో ఉన్న స్పెషల్ సాంగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చివరికి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.