మృణాల్ సెట్ లో ఎలా ఉంటుందో చెప్పిన శేష్

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.;

Update: 2026-04-09 10:43 GMT

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. షానియెల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమా మంచి హైప్‌ను సొంతం చేసుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ వెల్లడించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ నటన శైలి, ఆమె సెట్స్‌లో ప్రవర్తించే విధానం గురించి శేష్ చెప్పిన మాటలు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

శేష్ చెప్పిన వివరాల ప్రకారం, మృణాల్ సెట్స్‌లో చాలా ప్రత్యేకంగా, ఇతర నటీమణులకంటే భిన్నంగా ప్రవర్తిస్తుందని తెలుస్తోంది. సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు సీన్స్ మధ్యలో సరదాగా మాట్లాడటం, నవ్వులు పంచుకోవడం వంటి వాతావరణం కనిపిస్తుంటుంది. అయితే మృణాల్ మాత్రం అలాంటి దానికి భిన్నంగా ఉంటుందని శేష్ పేర్కొన్నారు.

మృణాల్ ఏ సీన్ షూట్ చేయాల్సి ఉందో ముందుగానే తెలుసుకుని, ఆ సీన్‌కు తగ్గట్టుగా తన మూడ్‌ను సిద్ధం చేసుకుంటుందని ఆయన చెప్పారు. ఉదాహరణకు, సీరియస్ లేదా ఎమోషనల్ సీన్ ఉంటే, ఆమె ముందుగానే చాలా సీరియస్‌గా మారిపోతుందని, ఆ ఎమోష‌న్ లోనే పూర్తిగా మునిగిపోతుందని వెల్లడించారు. అలాగే రొమాంటిక్ లేదా బ్యూటిఫుల్ సీన్ ఉంటే, అదే మూడ్‌లో ఉండిపోతూ ఆ రోజు షూట్ మొత్తాన్ని ఆ ఫీలింగ్‌తోనే కొనసాగిస్తుందని చెప్పారు.

ఉదయం సెట్స్ కు వచ్చిన వెంటనే సీన్ పేపర్ చూసుకుని, ఆ రోజు తన పాత్ర ఎలా ఉండాలో ముందుగానే ఫిక్స్ చేసుకుని, దానికి అనుగుణంగా రోజంతా ప్రవర్తిస్తుందని శేష్ తెలిపారు. మొదట్లో ఆమె ఈ విధానం తనకు కాస్త విచిత్రంగా అనిపించిందని, ఎందుకిలా ఒక్కసారిగా మారిపోతుంది? అని అనుకున్నానని ఆయన అన్నారు. అయితే నాలుగు ఐదు రోజుల తర్వాత ఆమె పని విధానం అర్థమైందని చెప్పారు. శేష్ చెప్పిన ఈ వివరాలను బట్టి చూస్తే, మృణాల్ ఠాకూర్ పూర్తిగా తన పాత్రలో లీనమై నటించే మెథడ్ యాక్టింగ్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News