8 ఏళ్ల తర్వాత తుంబాద్ డైరెక్టర్.. మాయసభ రిలీజ్ ఎప్పుడంటే?
మాయసభను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి.. చాలా ఏళ్ల క్రితం మూవీ కంప్లీట్ అయింది.;
తుంబాద్ మూవీ.. రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 2018లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ సినిమా.. ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. కానీ రీ రిలీజ్ ట్రెండ్ లో మాత్రం అదరగొట్టింది. గత ఏడాది రెండోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో భారీ వసూళ్లు రాబట్టింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ లో అత్యంత లాభాలు తెచ్చిన మూవీల్లో ఒకటిగా నిలిచింది. అంతే కాదు.. ఆ సినిమా డైరెక్టర్ రాహీ అనిల్ బర్వే వార్తల్లో నిలిచారు. ఆయన అప్ కమింగ్ మూవీస్ పై కూడా అందరి దృష్టి పడింది. అయితే తుంబాద్ మూవీ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత.. ఇప్పుడు కొత్త మూవీతో వస్తున్నారు అనిల్ బర్వే.
మాయసభను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి.. చాలా ఏళ్ల క్రితం మూవీ కంప్లీట్ అయింది. కానీ ఎందుకో అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుంది. ఆ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.
టీజర్ ప్రకారం, సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జావేద్ జాఫ్రీ ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి రేంజ్ ఉన్న బడా డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఎన్నోమందికి అవకాశాలు ఇచ్చిన ఆ నిర్మాత, తన ప్రేమించిన హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్నేళ్లకే ఆమె మరొక హీరోతో సంబంధం పెట్టుకుంటుంది. దీంతో సదరు నిర్మాత మోసపోతారు.
అయితే విచిత్ర అలవాట్లతో తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ వాతావరణంలో పెరిగిన 14 ఏళ్ల కుమారుడు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఒక రోజు ఆ బాలుడు ఇద్దరిని పాడుబడ్డ థియేటర్ లోకి తీసుకొస్తాడు. ఆ తర్వాత అక్కడ జరిగే సంఘటనలతో కథ ఆకస్మిక మలుపులు తిరుగుతుంది. నలుగురి మధ్య కథలా సాగుతోంది. చివరకు ఏమైందనేది సినిమాగా తెలుస్తోంది.
ఇప్పుడు టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. అందరినీ ఆకట్టుకుంటోంది. తుంబాద్ తో ప్రత్యేక ముద్ర వేసుకున్న రాహీ అనిల్ బర్వే.. మాయసభతో వింత ప్రపంచాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. మంచి థ్రిలర్ డ్రామాను తీసుకొస్తున్నారని అర్థమవుతోంది. ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా మాయసభ నిలవబోతుందని క్లియర్ గా టీజర్ ద్వారా కనిపిస్తుంది. మరి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.