పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్!
ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి అంటే? కెరీర్‌కు ముగింపు అనే భావన ఉండేది. కానీ కాలక్రమేణా ఆ ధోరణి మారింది. పెళ్లి తర్వాత కూడా నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.;
ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి అంటే? కెరీర్‌కు ముగింపు అనే భావన ఉండేది. కానీ కాలక్రమేణా ఆ ధోరణి మారింది. పెళ్లి తర్వాత కూడా నటీమణులు సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే కెరీర్ ప్లానింగ్‌లో దక్షిణాది, ఉత్తరాది నటీమణుల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. సౌత్ హీరోయిన్లు పెళ్లి తర్వాత పంథా మారుస్తుంటే? నార్త్ హీరోయిన్లు మాత్రం కమర్షియల్ ఫార్మాట్‌లోనే దూసుకుపోతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్, సమంత వంటి వారు పెళ్లి తర్వాత పాత్రల ఎంపికలో గణనీయమైన మార్పులు చేస్తున్నారు.
గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సమంత `యశోద`, `శాకుంతలం` వంటి చిత్రాలతో తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేసింది. కాజల్ అగర్వాల్ కూడా కంటెంట్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. రష్మిక మందన్నా? కూడా పెళ్లి అనే ఆలోచన మొదలవ్వగానే కెరీర్ పరంగా మార్పులకు తావిచ్చింది. కమర్శియల్ సినిమాలకంటే సోలోగా సత్తా చాటే చిత్రాల వైపు మనసు లగ్నం చేస్తోంది. ఇప్పటికే కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు `మైసా `రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో అమ్మడి సోలోగా దున్నేస్తుందనే అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.
బాలీవుడ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. దీపికా పదుకోణే, కియారా అద్వానీ, కత్రినా కైఫ్ వంటి అగ్ర నటీమణులు పెళ్లయ్యాక కూడా గ్లామర్ ఇమేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. పెళ్లికి ముందు ఎంతటి క్రేజీ కమర్షియల్ సినిమాల్లో నటించారో? పెళ్లి తర్వాత కూడా అగ్ర హీరోల సరసన భారీ యాక్షన్ , గ్లామరస్ రోల్స్‌లో రాణిస్తున్నారు. దీపికా పదుకొణే `పఠాన్`, `జవాన్` వంటి చిత్రాల్లో గ్లామర్ యాక్షన్‌తో మెప్పించడం తెలిసిందే. కియారా, అలియాభట్ కూడా ఎక్కడా తగ్గలేదు. కమర్శియల్ కథలతో పాటు బలమైన లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపైనా సీరియస్ గా పని చేస్తున్నారు.
సౌత్ హీరోయిన్లు ఎక్కువగా నటి అనే ముద్ర కోసం ఆరాటపడుతుంటారు. పెళ్లి తర్వాత కుటుంబ గౌరవం లేదా వ్యక్తిగత ప్రాధాన్యతల దృష్ట్యా పద్ధతైన పాత్రలనే ఎంచుకుంటున్నారు. అందుకే ఇక్కడ పెళ్లైన హీరోయిన్లకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే దిక్కు అనే పరిస్థితి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నార్త్ లో చూస్తే? అక్కడ హీరోయిన్లను బ్రాండ్ గా చూస్తారు. వారి వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన ఇమేజ్‌కు సంబంధం లేదన్నట్లుగా అక్కడి మేకర్స్ , ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి ప్రాంతీయ ప్రేక్షకుల మనస్తత్వం కూడా కారణం కావొచ్చు.
దక్షిణాది ప్రేక్షకులు హీరోయిన్లను పద్ధతైన చట్రంలో చూడటానికి ఇష్టపడతారు. కానీ నేటి తరం నటీమణులు ఈ అడ్డంకులను దాటుతున్నారు. పెళ్లి అనేది కేవలం వ్యక్తిగత విషయమని అది నటనకు అడ్డంకి కాకూడదని భావిస్తున్నారు. అయినా సౌత్ లో కమర్షియల్ సినిమాల్లో పెళ్లైన హీరోయిన్లను మెయిన్ లీడ్ గా తీసుకోవడానికి దర్శకులు ఇప్పటికీ కొంత వెనుకాడటం కనిపిస్తోంది. అయితే నటీమణులు పెళ్లి తర్వాత కూడా కెరీర్ కొనసాగించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అది లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైనా లేదా గ్లామర్ రోల్స్ అయినా.. ప్రతిభ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఇప్పటికే ప్రూవ్ అయింది. సౌత్ - నార్త్ అనే వ్యత్యాసం లేకుండా హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంటున్నారు.