ప్రపంచస్థాయి గుర్తింపు.. ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్!

సాధారణంగా సినిమాల ద్వారానే ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు.;

Update: 2025-11-04 14:30 GMT

సాధారణంగా సినిమాల ద్వారానే ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే సినిమాలు ఎక్కువగా చేయకపోయినా తమ అందంతో అందరినీ అలరించి.. ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారి ఇప్పుడు బాలీవుడ్ కంటే అంతర్జాతీయ స్థాయి నటిగా పేరు సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తోంది ప్రముఖ బ్యూటీ మానుషీ చిల్లర్. తన అద్భుతమైన అందంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక విషయంలోకి వెళ్తే.. హర్యానాకు చెందిన మానుషీ చిల్లర్ 2017లో చాలా ఏళ్ల తర్వాత భారతదేశానికి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించి భారతదేశానికి ఈ కిరీటాన్ని అందించిన ఆరవ నటిగా పేరు దక్కించుకుంది. ఈ పోటీలలో పాల్గొనడానికి ఏడాది పాటు విద్యకు కూడా దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్న తర్వాత ప్రాజెక్ట్ శక్తిలో భాగమైన ఈమె మహిళలకు నెలసరి సమయంలో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొంటుంది. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ స్థాయిలో కూడా అనేక అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన ఈమె.. స్కూబా డైవింగ్, బంగీజంప్ అంటే చాలా ఇష్టం అని, మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడం తన చిన్ననాటి లక్ష్యం అని చెప్పుకొచ్చింది. ఈమె మిస్ వరల్డ్ మాత్రమే కాదు మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. అంతేకాదండోయ్ నటిగా కూడా మంచి పేరు దక్కించుకుంది.

మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో కొన్నిటికి ప్రాతినిధ్యం వహించిన ఈమె.. వీటి ద్వారానే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ ఉత్పత్తులలో నటించేటప్పుడే బాలీవుడ్లో దాదాపు 5 నుండి 6 చిత్రాలలో అవకాశాలు లభించాయి. అన్నింటిలో నటించింది కానీ ఒక్క సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.

ఇకపోతే తనిష్క్ వంటి జువెలరీ బ్రాండ్స్ కి కూడా అంబాసిడర్ గా వ్యవహరించి.. ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకున్న ఈమె .. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన ఆడిదాస్, జిమ్మీ చూ , బల్గారి డియోర్ వంటి అంతర్జాతీయ పవర్ హౌస్లతో కూడా సంబంధం కలిగి ఉంది. ఇక ఫ్యాషన్ లగ్జరీ రంగాలలో తన ఆధిపత్య ఉనికిని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ఇకపోతే ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించి డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈమె తాజాగా రణవీర్ సింగ్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే రన్వీర్ సింగ్ నిర్మాత దినేష్ విజన్ తో ఈ సినిమా కోసం ముందస్తు చర్చలు జరుపుతున్నారని.. బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి . ఇందులో హీరోయిన్గా మానుషీ చిల్లర్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మానుషీ చిల్లర్ తో చర్చలు జరపగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పలు బ్రాండ్ ఉత్పత్తులతో అంతర్జాతీయ స్థాయి పాపులారిటీ అందుకున్న మానుషీ చిల్లర్ కు ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News