ప్రమాదం అనే ఒడ్డున ఇండియన్ సినిమా!
ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వాణిజ్యపరమైన మార్పులపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వాణిజ్యపరమైన మార్పులపై బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల ఆధిపత్యం పెరిగిపోవడం వల్ల చిన్న చిత్రాలు, కథాబలం ఉన్న సినిమాలు నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని మనోజ్ డిమాండ్ చేశారు. నేటి డిస్ట్రిబ్యూషన్ ..థియేట్రికల్ వ్యవస్థలో వందల కోట్ల బడ్జెట్‌తో వచ్చే కమర్షియల్ సినిమాలు మార్కెట్‌ను పూర్తిగా గుప్పిట్లోకి తీసుకుంటున్నాయన్నారు.
పెద్ద సినిమా విడుదలైనప్పుడు వేలాది థియేటర్లను.. దాదాపు అన్ని షోలను ఆ చిత్రానికే కేటాయించడం వల్ల చిన్న చిత్రాలకు స్క్రీన్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ విధమైన స్క్రీన్ మోనోపొలీ చిత్ర పరిశ్రమలో వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రేక్షకులు విభిన్నమైన కథలను చూసే అవకాశాన్ని కోల్పోతున్నారని మనోజ్ బాజ్‌పాయ్ అభిప్రాయపడ్డారు. కేవలం అగ్ర నటులు.. భారీ సాంకేతిక విలువలపైనే ఆధారపడే సినిమాలు మాత్రమే కాకుండా బలమైన సామాజిక అంశాలు, మానవీయ సంబంధాల చుట్టూ తిరిగే స్వతంత్ర చిత్రాలకు కూడా థియేటర్లలో గౌరవప్రదమైన స్థానం దక్కాలని ఆకాంక్షించారు.
సరైన రిలీజ్ డేట్లు కుదరకపోవడం తో ఎంతో కష్టపడి తీసిన మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయన్నారు. ఇది కేవలం చిత్రాలకే కాదు. పరిశ్రమ నమ్ముకున్న ఎంతోమంది ప్రతిభావంతులైన నూతన దర్శకులు, నటీనటుల భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. ఈ అసమానాన్ని తొలగించడానికి చిత్ర పరిశ్రమ అంతర్గత ప్రయత్నాలు మాత్రమే సరిపోవని ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని మనోజ్ బాజ్‌పాయ్ సూచించారు. థియేటర్ల కేటాయింపు, టికెట్ ధరల నియంత్రణ , చిన్న చిత్రాలకు సబ్సిడీలు వంటి విషయాలలో ప్రభుత్వ విధానాలు ఉండాలని కోరారు.
ప్రభుత్వ పెద్దలు .. పాలనా యంత్రాంగం ఈ సమస్యపై దృష్టి సారించి లలిత కళలు , సినిమా రంగాన్ని రక్షించేలా పారదర్శకమైన నిబంధనలను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో స్థానిక, చిన్న తరహా చిత్రాలను ప్రోత్సహించడానికి థియేటర్లలో ప్రత్యేక కోటాలను కేటాయించే పద్ధతులున్నాయి. భారతీయ సినీ రంగంలో కూడా అలాంటి వ్యవస్థను తీసుకురావడం వల్ల పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రేక్షకులు మంచి కంటెంట్‌ను ఆదరిస్తున్నప్పటికీ థియేటర్లలో ఆ సినిమాలను చూసే అనుభూతిని అందించడంలో మాత్రం థియేటర్ల యాజమాన్యాలు, పంపిణీ దారులు ఆశించిన స్థాయిలో సహకరించడం లేదనేది వాస్తవం.
సినిమా అనేది కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టే వ్యాపార వస్తువు మాత్రమే కాదు. అది సమాజ ప్రతిబింబమని మనోజ్ బాజ్‌పాయ్ గుర్తుచేశారు. పెద్ద సినిమాల ఉనికిని తానేమీ వ్యతిరేకించడం లేదని.. కానీ వాటితో పాటు చిన్న సినిమాలకు కూడా బతికే హక్కు, ప్రదర్శించే అవకాశం కల్పించడమే ఆరోగ్యకరమైన పరిశ్రమకు నిదర్శ నమన్నారు . చిత్ర పరిశ్రమలోని పెద్దలంతా సమష్టిగా ఆలోచించి మోనోపలి విధానానికి ముగింపు పలికినప్పుడే నిజమైన సినిమా బ్రతుకుతుందని...లేదంటే సినిమాకు భవిష్యత్ కూడా ఉండదని హెచ్చరించారు.