అనిరుధ్‌కు ప్రశంసలు.. తమన్‌కు ట్రోల్సు

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు.

Update: 2026-08-10 19:30 GMT

ప్రస్తుతం సౌత్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. వేరే సంగీత దర్శకులు క్వాంటిటీ విషయంలో అతణ్ని దాటొచ్చు కానీ.. క్వాలిటీ పరంగా చూస్తే అతడికి తిరుగులేదు. అనిరుధ్ పని చేస్తున్నాడు అంటే ఆ సినిమా సంగీతం వేరే లెవెల్లో ఉంటుంది.. అది సినిమాకు పెద్ద అసెట్ అవుతుంది.. తన సంగీతం కోసమే సినిమా చూడొచ్చు అని అందరూ బలంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ప్రతిసారీ అతను నిలబెట్టుకుంటూ ఉంటాడు.

అనిరుధ్‌కు దీటుగా నిలబడాలని, అతణ్ని దాటిపోవాలని వేర మ్యూజిక్ డైరెక్టర్లు ప్రయత్నిస్తుంటారు కానీ అదంత తేలిక కాదు. గత ఏడాది తమన్ ఈ విషయంలో ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. అనిరుధ్‌ పని చేసిన జైలర్, లియో లాంటి సినిమాలను ప్రస్తావిస్తూ.. వాటన్నింటికీ ‘ఓజీ’ మన సమాధానం అన్నాడు. ఆ సినిమా వరకు అనిరుధ్‌కు తమన్ దీటుగానే నిలిచాడు. ఓజీ పాటలు, బీజీఎం‌కు అదిరిపోయే స్పందన వచ్చింది.

కానీ తమన్ ప్రతి సినిమాకు అంత టైం పెట్టి, శ్రద్ధతో చేయడు. అందుక్కారణం అతను చాలా సినిమాలకు పని చేస్తుంటాడు. తనకు టైం తక్కువ. కొన్ని సినిమాలకు మొక్కుబడిగా మ్యూజిక్ లాగించేస్తుంటాడు. ‘కొరియన్ కనకరాజు’ ఆ కోవకు చెందిన సినిమానే అని చెప్పాలి. ఈ సినిమాలో పాటలు, బీజీఎంలో ఏ స్పెషాలిటీ కనిపించలేదు. మ్యూజిక్ విషయంలో బాగా విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల ‘ఓజీ’ బీజీఎంను రిపీట్ చేశాడంటూ అతణ్ని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద సినిమాలకు పెట్టే శ్రద్ధను చిన్న, మిడ్ రేంజ్ చిత్రాల కోసం కొంతైనా పెట్టవా అంటూ అతణ్ని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో అనిరుధ్ ‘డీసీ’ అనే మిడ్ రేంజ్ మూవీకి బ్యాంగ్ బ్యాంగ్ మ్యూజిక్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

కంటెంట్ పరంగా ‘డీసీ’ మరీ గొప్ప సినిమా కాదు. కథ రొటీనే అయినా.. టేకింగ్ చాలా బాగుంటుంది. ఎమోషన్లు వర్కవుట్ అయ్యాయి. ఐతే ఓ మోస్తరుగా అనిపించే సన్నివేశాలను కూడా తన బీజీఎంతో అనిరుధ్ వేరే లెవెల్లో నిలబెట్టాడు. ఎమోషన్లు పండడంలో కూడా తన స్కోర్ కీలక పాత్ర పోషించింది. ఈ స్థాయి సినిమా కోసం అతను అంత మనసు పెట్టి పని చేయడం.. ‘కల్ట్’ అనిపించే మ్యూజిక్ ఇవ్వడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంతో ప్యాషన్‌తో పని చేస్తే తప్ప ఇలాంటి ఔట్ పుట్ రాదని.. సినిమా స్థాయి చూడకుండా ఇలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని.. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అని వ్యాఖ్యానిస్తున్న నెటిజన్లు అనిరుధ్‌తో పోల్చి తమన్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News