ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ప్రపంచాన్ని ఏల్తున్న యువనటి!
సాధారణ రూపంతోనే హాలీవుడ్ ప్రయాణం ప్రారంభించిన జెండయా సూపర్ స్టార్ కావడం వెనుక తన క్రమశిక్షణ .. నటనపై ఉన్న అంకితభావమే ప్రధాన కారణాలు.
సినీ పరిశ్రమతో ఎలాంటి పరిచయం లేని ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతుల కుమార్తెగా వచ్చి.. నేడు హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ సినిమా రంగాన్ని ఏలుతోంది యంగ్ గ్లోబల్ సెన్సేషన్ జెండయా. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించిన జెండయా తండ్రి కాజెంబే అజాము కోల్‌మన్, తల్లి క్లేర్ స్టోర్మర్ ఇద్దరూ స్కూల్ టీచర్లుగానే పనిచేసేవారు. హాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్, డబ్బు లేదా పరిచయాలు లేని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఈ భామ.. నేడు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం వెనుక అపారమైన కష్టం దాగి ఉంది.
సాధారణ రూపంతోనే హాలీవుడ్ ప్రయాణం ప్రారంభించిన జెండయా సూపర్ స్టార్ కావడం వెనుక తన క్రమశిక్షణ .. నటనపై ఉన్న అంకితభావమే ప్రధాన కారణాలు. చిన్నతనంలో కాలిఫోర్నియా షేక్‌స్పియర్ థియేటర్‌లో తల్లికి సహాయం చేస్తూనే రకరకాల ప్రదర్శన కళలు, డ్యాన్స్ నేర్చుకున్న జెండయా చైల్డ్ మోడల్‌గా- బ్యాకప్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత డిస్నీ ఛానల్ సిరీస్ `షేక్ ఇట్ అప్` ద్వారా నటిగా బ్రేక్ తెచ్చుకున్న ఈ భామ కమర్షియల్ పాత్రలకే పరిమితం కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకునే ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటూ తన అద్భుత నటనా ప్రతిభతో అతిచిన్న వయసులోనే ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.
గ్లోబల్ రెడ్ కార్పెట్ ఐకాన్‌గా తన ఫ్యాషన్ స్టైల్‌తో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న జెండయా పేరు ఇప్పుడు భారతదేశంలోనూ మారుమోగుతోంది. ప్రస్తుతం ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయి వైపు దూసుకుపోతున్న హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే`లో MJ పాత్రలో ఆమె ప్రదర్శించిన నటనకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవలే సోనీ పిక్చర్స్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికలలో MJ ఈజ్ బ్యాక్! అంటూ జెండయాకు సంబంధించిన సరికొత్త ఫోటోషూట్‌ను షేర్ చేయగా.. అది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
జెండయా నటించిన టాప్ - 5 సినిమాలు:
స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజ్ :
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో టామ్ హాలండ్ సరసన `మిచెల్ ఎమ్‌జే`గా జెండయా చేసిన పాత్ర ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చింది. `హోమ్‌కమింగ్`, `ఫార్ ఫ్రమ్ హోమ్`, `నో వే హోమ్` ఇటీవల వచ్చిన `బ్రాండ్ న్యూ డే` చిత్రాలు తనను అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా నిలబెట్టాయి.
డ్యూన్ పార్ట్ 1 & 2 :
ప్రఖ్యాత దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్‌లో `చాని` అనే విభిన్నమైన పాత్రలో జెండయా తన నటనా పరిణతితో అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ది గ్రేటెస్ట్ షోమ్యాన్:
భారీ మ్యూజికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో జెండయా `యాన్ వీలర్` అనే ట్రాపెజ్ ఆర్టిస్ట్‌గా నటించి.. తన రియల్ డ్యాన్స్, నటన - సింగింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
ఛాలెంజర్స్: టెన్నిస్ క్రీడ నేపథ్యంగా సాగే ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో `టాషి డంకన్` అనే పవర్‌ఫుల్ ప్లేయర్ కమ్ కోచ్ పాత్రలో జెండయా ఒంటరిగా సినిమాను తన భుజస్కంధాలపై నడిపించి మెప్పించింది.
మాల్కమ్ & మేరీ : కేవలం ఇద్దరు నటులతో బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో రూపుదిద్దుకున్న ఈ ఇంటిమేట్ రొమాంటిక్ డ్రామాలో జెండయా తన లోతైన సంభాషణలు, హావభావాల నటనతో గొప్ప నటిగా నిరూపించుకుంది.