ట్రెండీ టాక్: భ‌న్సాలీ రేంజ్.. హిరాణీ- రోహిత్ శెట్టి రేంజ్ ఒకటేనా?

భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులు - స్టార్ హీరోల కలయికలో వచ్చే చిత్రాలకు థియేట్రికల్, డిజిటల్ - శాటిలైట్ బిజినెస్ పరంగా ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది.

Update: 2026-08-10 23:30 GMT

భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకులు - స్టార్ హీరోల కలయికలో వచ్చే చిత్రాలకు థియేట్రికల్, డిజిటల్ - శాటిలైట్ బిజినెస్ పరంగా ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ బిజినెస్ స్థాయిలు రూ. 150 కోట్ల నుంచి ఏకంగా రూ. 200 కోట్ల పైచిలుకు మార్కును దాటుతూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరాణీ , రోహిత్ శెట్టి వంటి బ్రాండ్ డైరెక్టర్లు తమ చిత్రాలతో ప్రీ-రిలీజ్ ట్రేడ్‌ను శాసిస్తున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ- రూ. 200 కోట్ల డీల్:

భారీ కలర్‌ఫుల్ సెట్లు.. అద్భుత‌మైన కాస్ట్యూమ్స్.. గ్రాండ్ విజువల్స్‌కు చిరునామా అయిన సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `లవ్ అండ్ వార్`. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, పెన్ మరుధర్ వంటి ప్రముఖ పంపిణీ సంస్థలు పోటీపడుతున్నాయి. పంపిణీదారులు రూ. 175-180 కోట్లు ఆఫర్ చేస్తుండగా.. నిర్మాతలు ఏకంగా రూ. 215 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు (రూ. 130 కోట్లు), శాటిలైట్, మ్యూజిక్ హక్కుల (రూ. 70-80 కోట్లు) ద్వారా విడుదల కాకముందే రూ. 200 కోట్లకు పైగా నాన్-థియేట్రికల్ బిజినెస్ సాధించడం భన్సాలీ మార్కెట్ స్టామినాకు అద్దం పడుతోంది.

రాజ్ కుమార్ హిరాణీ తిరుగులేని కంటెంట్- రికార్డు హక్కులు:

ఎంచుకునే క‌థాంశం.. భావోద్వేగాలు... కుటుంబ కథాంశాలను నమ్ముకునే రాజ్ కుమార్ హిరాణీ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద నూరు శాతం సక్సెస్ రేట్ ఉంది. షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన `డంకీ` చిత్రం కేవలం డిజిటల్ (ఓటీటీ) హక్కుల ద్వారానే రూ. 155 కోట్లకు అమ్ముడై ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. హిరాణీ-స్టార్ హీరోల కాంబో చిత్రాలకు థియేట్రికల్ రైట్స్ - ఓటీటీ బిజినెస్ కలిపి సునాయాసంగా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల పైచిలుకు ట్రేడ్ మార్కెట్‌ను సొంతం చేసుకుంటాయి.

రోహిత్ శెట్టి -మాస్ యాక్షన్ కు మాసివ్ బిజినెస్:

మాస్ ఆడియన్స్ ను థియేట‌ర్ల‌కు నడిపించే కమర్షియల్ హంగులు, కాప్ యూనివర్స్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే రోహిత్ శెట్టి చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్లలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న `సింగం అగైన్` చిత్రం థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 150 కోట్ల రేంజును అందుకుంది. అంతేకాకుండా ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ , మ్యూజిక్ హక్కులు విడుదల కాకముందే రూ. 200 కోట్లకు పైగా అమ్ముడై రోహిత్ శెట్టి బ్రాండ్ వ్యాల్యూను మరోసారి నిరూపించింది.

ఈ ముగ్గురు దిగ్గజ దర్శకులు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రాలకు భారీ థియేట్రికల్, నాన్-థియేట్రికల్ మార్కెట్‌ను క్రియేట్ చేస్తూ బాలీవుడ్ వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు.

Tags:    

Similar News