దర్శకులుగా వచ్చి హీరోలుగా!

ఈ అరుదైన కోవకు చెందిన ట్రెండ్‌లో తమిళ, కన్నడ , తెలుగు పరిశ్రమలలో పలువురు ప్రముఖులు ముందు వరుసలో ఉన్నారు.

Update: 2026-08-10 14:30 GMT

దర్శకత్వం అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్న సవాలుతో కూడిన ప్రయాణం. కెమెరా వెనుక నిలబడి వందలాది మంది సాంకేతిక నిపుణులను, నటీనటులను సమన్వయం చేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరించే దర్శకులకు తెరపై నటించడం అంత సులువైన విషయం కాదు. కానీ కొందరు ప్రతిభావంతులైన దర్శకులు ఈ హద్దులను చెరిపేస్తూ కెమెరా ముందు నటిస్తూ బాక్సాఫీస్ వద్ద అసాధారణ రికార్ట్లు సృష్టిస్తున్నారు. కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి హీరోలుగా మారి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఈ అరుదైన కోవకు చెందిన ట్రెండ్‌లో తమిళ, కన్నడ , తెలుగు పరిశ్రమలలో పలువురు ప్రముఖులు ముందు వరుసలో ఉన్నారు. కెమెరా ముందుకొచ్చి ప్రేక్షకులను మెప్పించడం ప్రతి దర్శకుడికి సాధ్యం కాదు. కానీ సరైన కథ, బలమైన స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ మోత మోగిపోతుందని నిరూపించారు. తమ సినిమాలకే కాకుండా ఇతర దర్శకుల చిత్రాల్లోనూ హీరోగా నటిస్తూ ఇండస్ట్రీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలో లోకేష్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్, రిషబ్ శెట్టి, ఉపేంద్ర, ఎస్.జె. సూర్య వంటి దర్శకులు హీరోలుగా సత్తా చాటుతున్నారు.

కోలీవుడ్‌లో తనదైన టెర్రిఫిక్ మేకింగ్ స్టైల్‌తో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన లోకేష్ కనగరాజ్ తాజాగా డీసీ తో నటుడిగానూ అదృ ష్టాన్ని పరీక్షించుకుని సంచలనం సృష్టిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా విభిన్నమైన ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తూ అద్భుతమైన నటనతో సినిమాను బ్లాక్‌బస్టర్ వైపు నడిపిస్తున్నారు. ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే లోకేష్ కేవలం డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగానూ ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ `లవ్ టుడే` సినిమాతో దర్శకుడిగా విజయం సాధించి, ఏకంగా హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆడిస్తున్నారు. ఆ తర్వాత వరుసగా `డ్రాగన్`, `డ్యూడ్` వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుని పాన్-ఇండియన్ స్టార్ రేంజ్‌కు ఎదుగుతున్నారు. మరోవైపు కన్నడ చిత్రసీమ నుంచి గ్లోబల్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగిన రిషబ్ శెట్టి కూడా ముందుగా దర్శకుడిగానే ప్రయాణాన్ని ప్రారంభించారు. `కిరిక్ పార్టీ` లాంటి సంచలన సినిమాను తెరకెక్కించిన ఆయనే `కాంతార` చిత్రంతో పూర్తిగా హీరోగా మారి సృష్టించిన సునామి గురించి చెప్పనవసరం లేదు.

కన్నడ పరిశ్రమలో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిన ఉపేంద్ర కూడా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి సెన్సేషనల్ హిట్స్‌తో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. అలాగే తమిళంలో ఎస్.జె. సూర్య కూడా నాని రీమేక్ చిత్రం ద్వారా హీరోగా మారి అటుపై విలక్షణ పాత్రలతో పాటు హీరోగా నటిస్తూ సత్తా చాటుకుంటున్నారు. తరుణ్ భాస్కర్, అభిజిత్ వంటి పలువురు దర్శకులు కూడా ఇదే బాటలో నడుస్తూ కెమెరా ముందు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అంతిమంగా చూస్తే.. తెర వెనుక కథలను అల్లుతూ చిత్ర పరిశ్రమను శాసించిన దర్శకులు, తెర ముందుకు వచ్చి నటులుగా కూడా ప్రతిభను చాటుకోవడం టాలీవుడ్ .. ఇతర భాషా పరిశ్రమలకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంపై, కథా కమామిషూపై పూర్తి అవగాహన ఉన్న వీరు హీరోలుగా మార‌డంతో చిత్రాల స్థాయి మరింత పెరుగుతోంది. భవిష్యత్తులోనూ దర్శకుల నుంచి మరిన్ని అద్భుతమైన చిత్రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News