విజయ్ 'రణబాలి'.. ఈసారి వీరతిలకమే!

యుద్ధానికి వెళ్లే వీరుడికి వీరతిలకం దిద్ది.. విజయంతో తిరిగి రావాలని కోరుకుంటారు.

Update: 2026-09-25 13:40 GMT

యుద్ధానికి వెళ్లే వీరుడికి వీరతిలకం దిద్ది.. విజయంతో తిరిగి రావాలని కోరుకుంటారు. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండకు కూడా అలాంటి వీరతిలకమే దిద్దారా? రణబాలిలో యోధుడిగా కనిపించనున్న విజయ్ లుక్ చూస్తే ఇదే ఫీలింగ్ కలుగుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్‌ లో విజయ్ నుదుట వీరతిలకం పెట్టినట్లు చూపించడంతో ఆ లుక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.




 


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న రణబాలిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ఆ జంట కలిసి నటిస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. దీనికి తోడు టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈసారి అసలు ఇంట్రెస్ట్ విజయ్ పోషిస్తున్న రోల్ పైనే ఉంది. 1854 నుంచి 1878 మధ్య కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో స్టోరీ సాగనున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది. ప్రజలు, మాతృభూమి కోసం పోరాడే యోధుడిగా విజయ్ కనిపించనున్నారు. అంటే ఈసారి నార్మల్ హీరోగా కాకుండా.. ఒక పోరాట యోధుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అందుకే కొత్త పోస్టర్‌ లో విజయ్ నుదుట వీరతిలకం పెట్టడం కూడా ఇంట్రెస్ట్ పెంచుతోంది. యుద్ధానికి బయల్దేరిన వీరుడికి విజయాన్ని కోరుతూ పెట్టే తిలకంలా.. ఆ లుక్‌ ను చూస్తే రణబాలి కూడా విజయ్‌ కు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందా అనే చర్చ మొదలైంది. గత కొంతకాలంగా విజయ్ నుంచి వచ్చిన సినిమాలు ఒక్కోసారి ఒక్కో రకమైన రిజల్ట్ అందుకున్నాయి.

లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల తర్వాత ఇప్పుడు ఆయన భారీ స్థాయి కథను ఎంచుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న రణబాలితో మరోసారి తన మార్కెట్‌ ను స్ట్రాంగ్ గా చూపించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో సినిమాకు ఉన్న భారీ స్థాయి కూడా ఆసక్తిని పెంచుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఏందయ్యా సామీ పాట ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచింది. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ కూడా పాటలో ఆకట్టుకుంది. ఇక ఇటీవల సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వచ్చినా.. అక్టోబర్ 16, 2026న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో దసరా బరిలో రణబాలి దిగడం ఫిక్స్ అయింది. ఇప్పుడు విజయ్ ముందున్నది కూడా ఒక రకమైన యుద్ధమే. భారీ అంచనాలు, భారీ కథ, పాన్ ఇండియా రిలీజ్.. అన్నింటినీ మోస్తూ రణబాలితో ఆయన బరిలోకి దిగుతున్నారు. మరి ఆ యోధుడు థియేటర్లలో ఎలాంటి విజయంతో తిరిగి వస్తారో అక్టోబర్ 16న తెలుస్తుంది.

Tags:    

Similar News