బిగ్ బడ్జెట్ హంగామా ఒక PR స్టంట్.. చిరాకుపడిన జాతీయ ఉత్తమ నటుడు!
ప్రేక్షకులు ఒక సినిమాను కేవలం థియేట్రికల్ అనుభూతి ఆధారంగానే అంచనా వేయాలి తప్ప డబ్బు-వసూళ్ల లెక్కలతో కాదని బాజ్‌పాయ్ స్పష్టం చేశారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వందల, వేల కోట్ల బడ్జెట్ ముచ్చట్లు ఒక ట్రెండ్‌గా మారాయి. సినిమా కథ, కథనాల కంటే ముందు దాని నిర్మాణ వ్యయం గురించే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు అగ్ర దర్శకులు రూపొందిస్తున్న చిత్రాలకు వందల కోట్లు ఖర్చు చేసేస్తున్నారంటూ ఒకటే ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి భారీ బడ్జెట్ ప్రచారాలపై విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ స్పందిస్తూ... ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేసే ఒక పీఆర్ (PR) స్టంట్ మాత్రమేనని విసుగు చెందారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ బాజ్‌పాయ్.. సినిమాలు ఎంత ఖర్చుతో రూపొందుతున్నాయనే బడ్జెట్ నంబర్ల కంటే ఆ సినిమా నాణ్యత ఎలా ఉందనే దానిపైనే ప్రేక్షకులు దృష్టి పెట్టాలని సూచించారు. సినిమా బడ్జెట్ గురించి ఈ తరహా చర్చలు గత 15 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఇది కేవలం హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఒక పీఆర్ టెక్నిక్! అని అభిప్రాయపడ్డారు. నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్స్ కోసం వందల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టామంటూ కాకి లెక్కలను తెరపైకి తెచ్చి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ భాజ్ పాయ్ సూటిగా విమర్శించారు.
సినిమా బడ్జెట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల గురించిన లెక్కలు నేడు సాధారణ ప్రేక్షకుల మెదళ్లలోకి కూడా ఎంతలా పాకాయో మనోజ్ ఒక ఉదాహరణతో వివరించారు. అసలు కలెక్షన్ల గురించి మాట్టాడే పిచ్చి ప్రజల్లో ఎంతదాకా వెళ్లిందంటే ఒకసారి నన్ను విమానాశ్రంయలో కలిసిన వ్యక్తి .. ఫలానా సినిమా ఇంత వసూలు చేసిందంటా! అంటూ మాట్లాడాడు. అది విన్న నేను గట్టిగా గద్ధిస్తూ.. అసలు మీకు జేబులోకి ఎంత వస్తుంది?? అని అడిగాను. సినిమా ఎలా ఉంది? నచ్చిందా లేదా? అనేది తప్ప కలెక్షన్లు, బడ్జెట్లతో మీకు పనిలేదని సూచించినట్టు చెప్పారు భాజ్ పాయ్. కోట్ల రూపాయలు ఏమైనా మీ బ్యాంక్ ఖాతాలోకి వెళ్తున్నాయా? ఒకవేళ ఆ డబ్బు మీ అకౌంట్‌లో పడితే అప్పుడు బాక్స్ ఆఫీస్ నంబర్ల గురించి మాట్లాడండి. సినిమా మీకు నచ్చిందా లేదా అనే దాని గురించి మాత్రమే మీరు చర్చించాలి.. అని ముక్కుసూటిగా చెబుతుంటాను!! అని ఆయన పేర్కొన్నారు.
ప్రేక్షకులు ఒక సినిమాను కేవలం థియేట్రికల్ అనుభూతి ఆధారంగానే అంచనా వేయాలి తప్ప డబ్బు-వసూళ్ల లెక్కలతో కాదని బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో మాట్లాడుకునే ఈ 500 కోట్లు, 600 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా ప్రేక్షకుడికి రాదు. కాబట్టి సినిమా నచ్చిందా లేదా అనేదే ప్రేక్షకుడికి.. ఆ చిత్రానికి ఉండే ఏకైక బంధం అని వారు గ్రహించాలి. మిగిలిన విషయాలతో వారికి సంబంధం లేదు. ఒక సినిమా వ్యాపారం అనేది కేవలం సదరు నిర్మాతకు సంబంధించిన వ్యక్తిగత అంశం! అని మనోజ్ హితవు పలికారు.
ఇటీవలి కాలంలో సినిమాల భారీ బడ్జెట్ల గురించి చాలా ప్రచారం సాగుతోంది. నితేష్ తివారీ `రామాయణ` రెండు భాగాల కోసం ఏకంగా 4000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, అలాగే ఎస్.ఎస్.రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న `వారణాసి` చిత్రం 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందనే వార్తలు ఇండస్ట్రీలో రోజూ హల్‌చల్ చేస్తున్నాయి. ఇవేగాక చాలా సినిమాలకు 500 కోట్లు అంతకుమించి ఖర్చు చేస్తున్నారన్న ప్రచారం ఆశ్చర్యపరుస్తోంది. అయితే వీటన్నిటి పైనా మనోజ్ భాజ్ పాయ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు బిగ్ పంచ్ వేసేసాడని అర్థం చేసుకోవాలి.
ఇదిలా ఉంటే మనోజ్ బాజ్‌పాయ్ ప్రస్తుతం తన చిత్రం `గవర్నర్` ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. 1990ల కాలంలో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ పొలిటికల్ డ్రామా తెరకెక్కింది. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాత. 90ల నాటి రాజకీయ సామాజిక సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. అమిత్ త్రివేది సంగీతం, జావేద్ అక్తర్ సాహిత్యం అందించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.