సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తో విష్ణు సినిమా?
కన్నప్ప సక్సెస్ ఇచ్చిన ఆనందంలో విష్ణు తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జోష్ గా ఉన్నారు.;
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా గత వారం రిలీజైంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న రిలీజై మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. టాక్ మిశ్రమంగా ఉన్నా కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. తనను, తన యాక్టింగ్ ను విమర్శించిన అందరికీ విష్ణు ఈ సినిమాతో సమాధానం చెప్పారు. కన్నప్ప సినిమాతో నటుడిగా విష్ణు మరో మెట్టు ఎక్కారు.
కన్నప్ప సక్సెస్ ఇచ్చిన ఆనందంలో విష్ణు తన తర్వాతి సినిమాల విషయంలో చాలా జోష్ గా ఉన్నారు. అందులో భాగంగానే విష్ణు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కన్నప్ప సినిమా తర్వాత విష్ణు ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమాకు తలూపారని సమాచారం. స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రభుదేవా ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.
కన్నప్ప సినిమాకు ప్రభుదేవానే కొరియోగ్రఫర్ గా వ్యవహరించగా, ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే విష్ణు, ప్రభుదేవా మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, ఆ బంధం ఇప్పుడు సినిమా వరకు వెళ్లిందని అంటున్నారు. అయితే ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉండేలా ప్రభుదేవా ప్లాన్ చేశారట.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మంచు ఫ్యామిలీనే నిర్మించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ప్రభుదేవా పౌర్ణమి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మరి ప్రభుదేవా, విష్ణు కు ఎలాంటి సినిమా ఇస్తారో చూడాలి.