మనోజ్ ఫిలాసఫీ.. బతికుంటే శివ.. చస్తే శవ..
ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ అయిన 'సైన్స్ వర్సెస్ దైవం' అనే పాయింట్ ని టచ్ చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శంబాల' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ సందడి చేశారు. ఎప్పుడూ తనదైన ఎనర్జీతో ఆకట్టుకునే మనోజ్, ఈసారి చాలా మెచ్యూర్డ్ గా, ఫిలాసఫికల్ గా మాట్లాడి అందరినీ ఆలోచింపజేశారు. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ అయిన 'సైన్స్ వర్సెస్ దైవం' అనే పాయింట్ ని టచ్ చేస్తూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మొదటగా ఆది గురించి మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు. "హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా ఆది ఎప్పుడూ కుంగిపోలేదు. కేవలం తన పనిని నమ్ముకుని నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. 25వ సినిమా వరకు రావడానికి అతని పట్టుదలే కారణం" అని ఆదిని ఆకాశానికెత్తేశారు. ఆది జర్నీ తనకు కూడా ఇన్స్పిరేషన్ అని మనోజ్ చెప్పడం విశేషం.
ఇక సినిమా టీమ్ గురించి మాట్లాడుతూ.. అమెరికా నుంచి వచ్చి ఇంత ప్యాషన్ తో సినిమా తీసిన దర్శకుడు యుగంధర్ మునిని, ఆయనకు సపోర్ట్ గా నిలిచిన నిర్మాతలను మనోజ్ అభినందించారు. ఇంతమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలిసి పనిచేయడం వల్లే అవుట్ పుట్ ఇంత బాగా వచ్చిందని, ట్రైలర్ ఇరగదీసిందని కితాబిచ్చారు.
అసలైన హైలైట్ ఏంటంటే.. దేవుడు, సైన్స్ గురించి మనోజ్ చెప్పిన విశ్లేషణ. "సైన్స్ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ, 7100 ఏళ్ల క్రితం వాల్మీకి రాసిన రామాయణంలోనే పుష్పక విమానం గురించి రాశారు. మన గుడుల నిర్మాణం వెనుక కూడా సైన్స్ ఉంది. సైన్స్ ఎప్పుడూ మన ధర్మంలోనే ఉంది" అని మనోజ్ చాలా లోతుగా విశ్లేషించారు.
కర్మ సిద్ధాంతం గురించి చెబుతూ.. "దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. మనం పదిమందికి సాయం చేస్తే దేవుడు మనకు తోడుంటాడు. అదే మోసం చేసి పైకి ఎదగాలనుకుంటే.. మనలోని రాక్షసుడే మనల్ని తినేస్తాడు. బతికుంటే శివ.. చస్తే శవ.. ఇదే నేను నేర్చుకున్నది" అంటూ మనోజ్ చెప్పిన ఫిలాసఫీ ఆడియెన్స్ చేత చప్పట్లు కొట్టించింది. చివరగా డిసెంబర్ 25న విడుదల కాబోతున్న 'శంబాల' సినిమా పెద్ద హిట్ అవ్వాలని, థియేటర్లలోనే ఈ సినిమాను చూసి ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరారు. ఒక మంచి ఉద్దేశంతో, ప్యాషన్ తో తీసిన ఇలాంటి సినిమాలు కచ్చితంగా గెలవాలని మనోజ్ ఆకాంక్షించారు.