నెపో కిడ్స్.. మంచు మనోజ్ పర్ఫెక్ట్ క్లారిటీ
టాలీవుడ్‌లో చాలాకాలంగా నెపోటిజం గురించి చర్చ నడుస్తూనే ఉంది. బాలీవుడ్‌లో అయితే ఇది మరింత పెద్దగా వినిపించేది.;
టాలీవుడ్‌లో చాలాకాలంగా నెపోటిజం గురించి చర్చ నడుస్తూనే ఉంది. బాలీవుడ్‌లో అయితే ఇది మరింత పెద్దగా వినిపించేది. సినీ కుటుంబం నుంచి వచ్చిన వారు అవకాశం సంపాదించడం సులువు అని కొందరంటే, టాలెంట్ లేకపోతే ఎవరూ నిలబడలేరని మరికొందరు అంటుంటారు. తాజాగా మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త దిశను ఇచ్చాయి. ఓ సినిమా ఈవెంట్‌లో మనోజ్ చెప్పిన మాటలు ఇండస్ట్రీలోని యువ నటులకు మోటివేషన్‌లా మారాయి.
‘ఓ భామ అయ్యో రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా పాల్గొన్న మనోజ్ మాట్లాడుతూ.. నటుడిగా ఎదగాలంటే కష్టపడక తప్పదని చెప్పారు. ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని సినిమాల్లో సక్సెస్ గ్యారెంటీ అనుకోవడం పొరపాటేనని, తాను స్వయంగా ఒక ఉదాహరణ అని చెప్పకనే చెప్పారు. అలాగే ఈ తరానికి సుహాస్ లాంటి నటుడు స్ఫూర్తిదాయకుడు అని అభిప్రాయపడ్డారు.
"సుహాస్ యూట్యూబ్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి హీరో స్థాయికి వచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. నేటి యువత అతని నుంచి చాలా నేర్చుకోవాలి. ఇండస్ట్రీకి బ్యాక్‌గ్రౌండ్ సహాయపడుతుందేమో కానీ, అది చాలదు. ఒక్కో మెట్టు ఎక్కాలంటే కష్టం తప్పదు. నెపో కిడ్స్ అయినా దేకాల్సిందే. అలాగే బడ్జెట్, మల్టీస్టారర్ లాంటి వలనే విజయం వస్తుందనుకుంటే, అది పెద్ద తప్పు. సినిమాకు కంటెంట్ ఉంటే చాలు.. అది చిన్నదా పెద్దదా అన్న ఫార్ములాలు పని చేయవు." అని మనోజ్ చెప్పారు.
ఈ కామెంట్స్ ఎందరో యువ నటులకు ధైర్యాన్ని ఇచ్చినట్టయింది. మనోజ్ చెప్పినట్టు, ఆయన స్వయంగా మోహన్ బాబు లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కుమారుడైనా ఇండస్ట్రీలో హీరోగా పూర్తి స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల భైరవంలో విలన్‌గా కనిపించినా, అది ఆశించినంత గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం మిగతా వారిని ఆలోచనల్లో పడేశాయి. మనోజ్ మాత్రం పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నట్లు అర్ధమవుతుంది.
ఇక ఇదే వేదికపై మాట్లాడుతూ, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తరహాలోనే సుహాస్ డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు అంటూ ఒకవైపు హీరోగా మరోవైపు ఆర్టిస్ట్ గా చేయడం మంచి విషయం అని చెప్పారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్ళు నిజమైన స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. అలాగే, సుహాస్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడని కొనియాడారు.
ఇక జూలై 11న విడుదల కానున్న ‘ఓ భామ అయ్యో రామ’ సినిమా మీద సుహాస్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈమధ్య కాలంలో చిన్న హీరోలలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నది ఇతనొక్కడే. అయితే ఇంతకుముందు వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు. నాన్ థియేట్రికల్ గా సుహాస్ సినిమాకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ థియేట్రికల్ గా ఇంకా ఒక స్టాండర్డ్ సెట్టవలేదు. కాబట్టి అతను ఒక బిగ్ హిట్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది.