డాల్బీ అయితేనే థియేటర్లకు వస్తారా?

అయితే కేవలం సాంకేతికత సరిపోదు. సినిమా కథ స్ట్రాంగ్ గా లేకపోతే, ప్రేక్షకులను ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా వారు థియేటర్లకు రావడం కష్టమే.;

Update: 2026-03-16 05:57 GMT

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి హై టెక్నాలజీలను వినియోగించడం పెరుగుతోంది. ముఖ్యంగా డాల్బీ సౌండ్ సిస్టమ్స్, అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్లు వంటి అంశాలపై నిర్మాతలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే కేవలం సాంకేతికతను పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? లేక మంచి కథ ఉంటే వస్తారా? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో సాగుతోంది.

సినిమా థియేటర్లలో డాల్బీ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం వల్ల ప్రేక్షకులకు మెరుగైన ఆడియో అనుభూతి లభిస్తుంది. ముఖ్యంగా యాక్షన్, ఫాంటసీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు.. ఆ టెక్నాలజీతో మరింత ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి. అందుకే అనేక థియేటర్లు డాల్బీ సిస్టమ్లను ఏర్పాటు చేసి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే కేవలం సాంకేతికత సరిపోదు. సినిమా కథ స్ట్రాంగ్ గా లేకపోతే, ప్రేక్షకులను ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా వారు థియేటర్లకు రావడం కష్టమే. గతంలో చిన్న బడ్జెట్‌ తో వచ్చిన కొన్ని సినిమాలు మంచి కథతో పెద్ద విజయాలు సాధించాయి. మరోవైపు భారీ బడ్జెట్‌ తో అత్యాధునిక టెక్నాలజీతో తీసిన కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి.

ఇక బడ్జెట్ పెరుగుతున్న కొద్దీ టికెట్ ధరలు కూడా పెరుగుతున్నాయి. పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్ ధరలు పెంచడం ఇటీవల సాధారణంగా మారింది. దీనిపై ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం మొత్తం థియేటర్‌ కు వెళ్లి సినిమా చూడాలంటే ఖర్చు ఎక్కువ అవుతోందని చాలామంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ వేదికలు కూడా ప్రేక్షకులకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

అయితే సినిమా వాళ్లేమో నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెరగడం తప్పనిసరి అని కొందరు భావిస్తున్నారు. భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పారితోషికాలు అన్నీ ఇవన్నీ కలిసి సినిమా బడ్జెట్‌ ను పెంచుతున్నాయి. అయితే ఆ ఖర్చు మొత్తాన్ని ప్రేక్షకులపై మోపడం సరైన విధానమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఏదేమైనా ప్రేక్షకుల అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. కంటెంట్ ఆసక్తికరంగా ఉంటే.. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటే, టెక్నాలజీతో సంబంధం లేకుండా థియేటర్లకు వస్తారు. కానీ భారీ ప్రమోషన్స్, డాల్బీ సౌండ్ లేదా సాంకేతికత ఉన్నా కంటెంట్ వీక్ గా ఉంటే ఆసక్తి చూపడం లేదు. అందుకే టెక్నాలజీ డెవలప్మెంట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినా, సినిమా విజయాన్ని నిర్ణయించే అసలు అంశం కంటెంట్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే కేవలం డాల్బీ సిస్టమ్స్ సరిపోవు. కంటెంట్ ఉండటం కూడా ముఖ్యం!

Tags:    

Similar News