రావిపూడి స్పీడును తట్టుకోవడం కష్టమే!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
తెలుగు సినిమా సత్తా ప్రపంచ స్థాయికి ఎదిగిన నేపథ్యంలో ప్రతీ సినిమానీ మేకర్స్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ, మేకింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తుంటే, డైరెక్టర్లు ప్రతీ ఫ్రేమ్ విషయంలో పర్ఫెక్షన్ కోసం పాకులాడుతున్నారు. అందుకే ప్రతీ సినిమా అనుకున్న దానికంటే లేటవుతుంది.
పర్ఫెక్షన్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకనిర్మాతలు, హీరోలు కూడా తమ సినిమా రావడం కాస్త లేటైనా పర్లేదు అనుకుంటున్నారు. కానీ లేట్ అనే పదానికి అనిల్ రావిపూడి మాత్రం మినహాయింపు. ఈ మధ్య ఏ డైరెక్టర్ అయినా చెప్పిన డేట్ కు సినిమాను రిలీజ్ చేయడానికే నానా తిప్పలు పడుతుంటే అనిల్ రావిపూడి మాత్రం తన సినిమా షెడ్యూల్స్ అన్నింటినీ అనుకున్న దాని కంటే ముందే పూర్తి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
మెగాస్టార్‌తో మన శంకరవరప్రసాద్ గారు..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేయనున్నారనే విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అక్టోబర్ లో భారీ షెడ్యూల్
తాజా సమాచారం ప్రకారం మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి అక్టోబర్ లో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట మేకర్స్. ఈ షెడ్యూల్ తో సినిమా మేజర్ షూటింగ్ ను పూర్తి చేసే ప్లానింగ్ లో అనిల్ ఉన్నారని, ఈ అక్టోబర్ షెడ్యూల్ లోనే విక్టరీ వెంకటేష్ కూడా జాయిన్ కానున్నారని తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి, ప్రమోషన్స్ కోసం కాస్త ఎక్కువగా టైమ్ ను కేటాయించాలని చూస్తున్నారట అనిల్. ఏదేమైనా మన శంకరవరప్రసాద్ ను అనిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా నడిపిస్తున్నారు. ఇవన్నీ చూసి అనిల్ స్పీడును తట్టుకోవడం మిగిలిన వారికి కష్టమే అని అంటున్నారు.