తెరపై మల్లన్న మ్యాజిక్ చేసేదెవరు?

మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు , ప్ర‌ముఖ‌ విద్యావేత్త మల్లారెడ్డి త‌న విలక్షణమైన శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.;

Update: 2026-05-04 10:30 GMT

మాజీ మంత్రి, రాజకీయ నాయకుడు , ప్ర‌ముఖ‌ విద్యావేత్త మల్లారెడ్డి త‌న విలక్షణమైన శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన మాట తీరు, మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రచారాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే. అయితే తాజాగా మ‌ల్లారెడ్డి జీవితం వెండితెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తన బయోపిక్ తీస్తే చూడాలని ఉందని మల్లారెడ్డి స్వయంగా తన ఆకాంక్షను వెల్ల‌డించారు. దీంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ మొదలైంది. మల్లారెడ్డి జీవితం నిజంగానే ఒక సినిమా స్క్రిప్ట్‌లా సాగుతుంది. సైకిల్‌పై పాలు అమ్మే స్థాయి నుండి నేడు వేల కోట్ల విద్యా సంస్థల సామ్రాజ్యాన్ని నిర్మించడం ఆపై రాజకీయాల్లో ఎంపీగా, మంత్రిగా ఎదగడం వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

ఒక సామాన్యుడు పట్టుదలతో తలచుకుంటే ఏ స్థాయికి చేరవచ్చో చెప్పడానికి ఆయన జీవితమే ఓ మంచి ఉదాహరణ. అందుకే ఈ కథను తెరకెక్కించడానికి పలువురు దర్శకులు ఆసక్తి చూపించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే? గతంలో పవన్ కళ్యాణ్ నటించిన `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో మల్లారెడ్డికి విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చిది. స్వ‌యంగా ఆ చిత్ర దర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ వెళ్లి మ‌ల్లారెడ్డికి విల‌న్ ఆఫ‌ర్ చేసారు. కానీ మ‌ల్లారెడ్డి అవ‌కాశాన్ని సున్నితంగా తిర‌స్క‌రించారు.

అయితే నటుడిగా కాకపోయినా? తన కథను తెరపై చూడాలనే కోరిక ఆయనలో మాత్రం బలంగా ఉంది. అయితే మ‌ల్లారెడ్డి క‌థ‌ను ఎవరు రాస్తారు? ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనేవి ఇప్పుడు కీలక ప్రశ్నలు. మల్లారెడ్డి వ్యక్తిత్వంలో ఉండే హాస్యం, ఆవేశం , పట్టుదలను వెండితెరపై పండించాలంటే ఆ స్థాయి దర్శకుడు ఉండాలి. మల్లారెడ్డి రా అండ్ రస్టిక్ శైలిని ప్రతిబింబించేలా కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది. కేవలం ఆయన రాజకీయ జీవితమే కాకుండా విద్యా సంస్థల స్థాపనలో ఆయన పడిన కష్టాలను కూడా ఇందులో చూపించాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ మల్లారెడ్డి తన పాత్రను తానే పోషిస్తే అది టాలీవుడ్‌లో ఓ వినూత్న ప్రయోగం అవుతుంది. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ , క్రేజ్ దృష్ట్యా థియేటర్లలో సందడి గ్యారెంటీ. తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను, ఆ సక్సెస్ మంత్రాన్ని యువతకు చేరువ చేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఈ బయోపిక్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి బయోపిక్ అనేది వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. అదొక‌ మధ్యతరగతి కలల సాకారం. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే తెలంగాణ రాజకీయ , సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. మరి మల్లన్న కలను నిజం చేసే ఆ దర్శకుడు ఎవరో? ఆ కింగ్ మేకర్ పాత్రలో ఎవరు మెరుస్తారో? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News