రూ.15 కోట్లతో బాహుబలి రేంజ్ రెవెన్యూ? మాలీవుడ్ టార్గెట్ అదేనా?
ఇదిలా ఉండగా, మాలీవుడ్ కు సంబంధించి నిర్మాత రవిశంకర్ చెప్పిన ఫార్ములా ఇతర ఇండస్ట్రీలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది.;
సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పెడితే భారీ వసూళ్లు వస్తాయనే ఫార్ములాను మాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రశ్నిస్తోంది! తక్కువ ఖర్చుతో ఎక్కువ రెవెన్యూ సాధించాలనే టార్గెట్ తో ముందుకు సాగుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవిశంకర్ ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్.. ఆ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
ఒక ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ తో జరిగిన కన్వర్జేషన్ ను వెల్లడించారు. "ఫహాద్ ఫాజిల్ గారు డిన్నర్ కు రమ్మంటే కేరళ వెళ్లాను. అక్కడ జరిగిన చర్చలో ఒక మాట చెప్పారు. మేము కేరళ ఇండస్ట్రీలో రూ.15- 20 కోట్ల బడ్జెట్ లోనే బాహుబలి వంటి రేంజ్ రెవెన్యూ సాధించాలనుకుంటున్నామని అన్నారు" అని రవిశంకర్ తెలిపారు.
పెద్ద రెవెన్యూ కోసం భారీ బడ్జెట్ తప్పనిసరి కాదనేది వాళ్ల ఆలోచనని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడ ప్రస్తావనలోకి వచ్చిన బాహుబలి సినిమా భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్, భారీ వసూళ్లకు సింబల్ గా నిలిచింది. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల వసూళ్లు సాధించింది. పెద్ద సినిమాలకు ఒక బెంచ్ మార్క్ గా మారింది.
అయితే మాలీవుడ్ మాత్రం భిన్నమైన దారిని ఎంచుకుంటోంది. మలయాళ సినిమాలు గత కొన్నేళ్లుగా కంటెంట్ బేస్డ్ ప్రాజెక్టులుగా, రియలిస్టిక్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా మంచి లాభాలు సాధిస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే ఫార్ములాను మాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. అందుకే రూ.15-20 కోట్లలోనే నిర్మించి, భారీ లాభాలను టార్గెట్ చేస్తోంది.
అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్, ఫహాద్ ఫాజిల్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సంస్థ నిర్మించిన పుష్ప: ది రైజ్ సినిమాతో ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. విలన్ గా ఆయన యాక్టింగ్ అందరినీ మెప్పించింది. పుష్ప: ది రూల్ లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఫహాద్ ఫాజిల్ తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇదిలా ఉండగా, మాలీవుడ్ కు సంబంధించి నిర్మాత రవిశంకర్ చెప్పిన ఫార్ములా ఇతర ఇండస్ట్రీలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. భారీ ఖర్చులు పెట్టి రిస్క్ తీసుకోవడం కంటే, సరైన కథ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, నేచరుల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని వారు నిరూపిస్తున్నారు. ఏదేమైనా చిన్న బడ్జెట్, పెద్ద రెవెన్యూ కాన్సెప్ట్ తో మాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇది ఫ్యూచర్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ శైలిని మార్చే అవకాశం ఉందేమో.