ఎన్నేళ్లు గడిచినా వర్మ మారలేదు..ఇప్పటికీ అదే తిరుగుబాటు!
| రామ్ గోపాల్ వర్మలో ఇప్పటికీ కొత్తదనం కోసం తపించే తిరుగుబాటు తత్వం అలాగే ఉందని నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రశంసించారు. ‘సత్య’, ‘కౌన్’ వంటి సినిమాలతో తనకు భిన్నమైన పాత్రలు ఇచ్చిన ఘనత వర్మదేనని గుర్తుచేసుకున్నారు. వీరిద్దరూ తాజాగా ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు.
కాలంతో పాటు చాలా మంది దర్శకులు శైలిని మార్చుకుంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం తనలో తిరుగుబాటు తత్వాన్ని ఏమాత్రం కోల్పోలేదని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి అభిప్రాయప్డారు. గతంలో `దౌడ్`,`సత్య`, `కౌన్`, `సర్కార్ 3` వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన హిట్ కాంబినేషన్ తాజాగా `పోలీస్ స్టేషన్ మే భూత్` అనే చిత్రం కోసం మరోసారి చేతులు కలిపింది. ఈ సందర్భంగా వర్మతో తన ప్రయాణం గురించి మనోజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామ్ గోపాల్ వర్మలో ఇప్పటికీ అదే అశాంతి. కొత్తదనం కోసం తపించే గుణం ఉన్నాయని మనోజ్ కొనియాడారు.
సినిమా తీరును మార్చే ప్రయత్నం చేయడంలో ఆయన ఎప్పుడూ విప్లవాత్మకంగా ఆలోచిస్తారన్నారు. ఎవరూ ఊహించని కోణాలను తెరపై ఆవిష్కరించడమే వర్మ ప్రత్యేకత అని కొనియాడారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా? అప్పట్లో చూసిన ఆ రెబల్ వర్మ ఇప్పటికీ అలాగే ఉన్నారన్నారు. మనోజ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సైకలాజికల్ థ్రిల్లర్ `కౌన్` గురించి గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా చేయాలన్న ఆలోచన అందులో తనను ఎంపిక చేయాలన్న నిర్ణయం పూర్తిగా రామూదేనని గుర్తుచేసుకున్నారు.
భారతదేశంలో అంతకుముందు ఎవరూ చేయని విభిన్నమైన ప్రయోగాత్మక పాత్రలు అందించినందుకు వర్మకు ఎప్పటికీ రుణపడే ఉంటానన్నారు. తనపై నమ్మకంతో వర్మ ఇచ్చిన సినిమాలే ఫిల్మోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయన్నారు. సోషల్ మీడియా.. ఓటీటీ వేదికల రాకతో ప్రపంచ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువైందని మనోజ్ విశ్లేషించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రూపొందుతున్న విభిన్న కథలను మనం ఎన్నో ఏళ్ల క్రితమే భారతీయ తెరపై చేశామన్న విషయం ఇప్పుడు చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
ఇటీవల విడుదలైన `గజబ్ రాత్` చిత్రంలో డబ్బు.. వ్యామోహం చుట్టూ తిరిగే ఓ అవినీతి పోలీసు అధికారిగా నటించిన మనోజ్ సాధారణ హీరోయిజం ఉన్న పాత్రల కంటే భిన్న కోణాలు ఉన్న పాత్రలే ఇష్టమని స్పష్టం చేశారు. తన కెరీర్‌లో రొటీన్ పాత్రలు చాలా తక్కువగా చేసానని.. పాత్రలో చిక్కుముడులను విప్పుతూ నటించడంలోనే అసలైన తృప్తి ఉంటుందని వివరించారు.ప్రస్తుతం బారతీయ ప్రేక్షకులు ఓటీటీలలో సైకలాజికల్ థ్రిల్లర్లను గతంలో కంటే ఎక్కువగా ఆదరిస్తున్నారన్నారు. నటుడిగానూ ప్రేక్షకుడిగానూ తనకు అత్యంత ఇష్టమైన ఈ జానర్‌కు ఎప్పటికీ ఆదరణ తగ్గదని మనోజ్ ధీమా వ్యక్తం చేశారు.