తెలంగాణ యాస..1960ల నాటి కొత్త ప్రపంచం!
| సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘భోగి’ నవంబర్ 27న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ కాపీ చూసిన తర్వాత సినిమాపై పూర్తి నమ్మకం వచ్చిందని శర్వా తెలిపారు. తెలంగాణ యాస, కొత్త తరహా పాత్ర కోసం కష్టపడ్డానని చెప్పారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ రివైజింగ్ కమిటీ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం `భోగి` విడుదల తేదీ దగ్గర పడుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ వేదికపై శర్వానంద్ విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు ఉండే టెన్షన్ ఈసారి లేదని ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే పూర్తి సంతృప్తితో ఉన్నానని శర్వా తెలిపారు. కథ చెప్పినప్పుడు దీన్ని సంపత్ నంది తెరపై ఎలా తీస్తారా? అన్న సందేహం తొలుత ఉండేదని శర్వానంద్ నిజాయితీగా చెప్పారు. అయితే తుది అవుట్‌పుట్ చూసాక ఆ ఆందోళన పూర్తిగా పోయిందన్నారు. చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడటానికి ఎంతో శ్రమించానని..తన నటన ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు.. రొమాంటిక్ సినిమాలతో కనిపించిన తనని `భోగి` ద్వారా సరికొత్త కోణంలో చూపించారని సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాతో నటుడిగా కొత్తగా పరిచయమ వుతున్నట్లు అనిపిస్తోందన్నారు. రెగ్యులర్ ఇమేజ్‌కు భిన్నమైన ఈ ప్రాజెక్ట్‌ను నమ్మి నిర్మించిన నిర్మాత కేకే రాధామోహన్ ను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతితో పాటు చెల్లెళ్ల పాత్రలు పోషించిన నటీనటులందరూ కథను నమ్మి కలిసి పనిచేశారన్నారు.
ముఖ్యంగా 1960ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తీర్చిదిద్దిన ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సెట్‌లో షూటింగ్ చేసినా అది నిజమైన లొకేషన్ లాగే అనిపిస్తుందని.. ఆర్ట్ డైరెక్టర్ గురించి ఇంత వివరంగా మాట్లాడటం తన కెరీర్‌లో ఇదే తొలిసారన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఓ ఊరి నేపథ్యంలో 1960ల ప్రారంభ కాలంలో సాగే కథతో `భోగి` తెరకెక్కింది.
ఓ బలమైన భూస్వామి గుప్పెట్లో ఉన్న గ్రామంలో ప్రతి అమావాస్య తర్వాత యువకులు అదృశ్యమవుతుండటం.. ఆ మిస్టరీని గంగ అనే పాత్రధారి శర్వానంద్ ఎలా? ఛేదించాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన చిత్రానికి సెన్సార్ రివైజింగ్ కమిటీ తర్వాత `ఏ` సర్టిఫికెట్ లభించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘భోగి’ విడుదల కానుంది.