నారా రోహిత్.. నవంబర్ ఎంత స్పెషల్ అంటే..
| నారా రోహిత్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘సోలో’ 15 ఏళ్లు, ‘రౌడీ ఫెలో’ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా రెండు సినిమాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ రోహిత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ చిత్రాలు తనకు ఎంతో ప్రత్యేకమని, నవంబర్ నెల జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
నారా రోహిత్ కెరీర్‌లో కొన్ని సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా సోలో, రౌడీ ఫెలో సినిమాల గురించి అభిమానులు తరచూ మాట్లాడుకుంటుంటారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి నవంబర్‌లోనే స్పెషల్ అకేషన్స్ రావడం విశేషం. లేటెస్ట్ గా నారా రోహిత్ కూడా సోషల్ మీడియాలో వాటిని గుర్తుచేసుకుంటూ రెండు పోస్టులు పెట్టారు. తన కెరీర్‌లో ఈ సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పుకొచ్చారు.
2011 నవంబర్ 25న విడుదలైన సోలో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నారా రోహిత్‌కు జోడీగా నిషా అగర్వాల్ నటించారు. అప్పట్లో ఈ సినిమా యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, ప్రేమకథలోని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. నారా రోహిత్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల లిస్టులో ఇది బిగ్గెస్ట్ హిట్.
ఇక 2014 నవంబర్ 21న విడుదలైన రౌడీ ఫెలో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. పోలీస్ పాత్రలో నారా రోహిత్‌ను చూపించిన విధానం అప్పట్లో బాగా హైలెట్ అయ్యింది. ముఖ్యంగా డైలాగ్స్, హీరో యాటిట్యూడ్, కథను నడిపించిన తీరు ఆకట్టుకున్నాయి.
నిజానికి నారా రోహిత్ కెరీర్‌ను గమనిస్తే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బాణం, ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలు అందుకు ఉదాహరణలు. కొన్ని సినిమాలకు ఆశించిన వసూళ్లు రాకపోయినా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సోలోలో కనిపించిన రోహిత్‌కు, రౌడీ ఫెలోలో కనిపించిన రోహిత్‌కు చాలా తేడా ఉంటుంది. అదే తన స్క్రిప్ట్ సెలక్షన్‌లో హైలెట్.
ఇప్పుడు ఈ రెండు సినిమాల గురించి నారా రోహిత్ పెట్టిన పోస్టుల్లోనూ ఆ అనుబంధం కనిపిస్తోంది. రౌడీ ఫెలో తన మనసుకు దగ్గరైన సినిమాల్లో ఒకటని చెబుతూ దర్శకుడు కృష్ణ చైతన్యతో పాటు టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఇక సోలో గురించి మాట్లాడుతూ కొన్ని నవంబర్ నెలలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. రెండు అందమైన సినిమా ప్రయాణాలను గుర్తుచేసుకుంటూ తనకు నవంబర్ నిజంగా లక్కీ మంత్ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు నారా రోహిత్ కొంత విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం కూడా కొత్త కథలను ఎంచుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక కృష్ణ చైతన్య కూడా రౌడీ ఫెలో తర్వాత చల్ మోహన్ రంగ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ లో కంటెంట్ ఉన్న టాలెంటెడ్ దస్రహకుల్లో కృష్ణ చైతన్య ఒకరు. ఇక నారా రోహిత్ తో మరో సినిమా చేస్తే బాగుంటుందని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.