బాలీ రిసార్టులో `రాజా సాబ్` బ్యూటీ.. మ‌న బీచ్‌లేవీ న‌చ్చ‌వెందుకు?

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ మాళవిక మోహనన్ తన తాజా సోషల్ మీడియా పోస్టులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.;

Update: 2026-04-17 19:30 GMT

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన హీరోయిన్ మాళవిక మోహనన్ తన తాజా సోషల్ మీడియా పోస్టులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అందమైన బులుగు రంగు సముద్రం, బీచ్ అంచున వేలాడుతున్నట్టుగా ఉన్న రిసార్టులలో ఈ భామ ప్రకృతిని ఆస్వాధిస్తూ కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీలోని లగ్జరీ రిసార్టులకు ప్రమోషన్ చేస్తూ మాళ‌విక‌ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. షూటింగ్ విరామాల్లో విదేశీ తీర ప్రాంతాల్లో సేదతీరుతూ తన ఫాలోవర్లకు కొత్త ట్రావెల్ గోల్స్ ఇస్తోంది.

సినిమా ఫలితాల విషయానికొస్తే, ఈ భామకు ఇటీవల కాలం పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. సూర్య సరసన నటించిన `కంగువ` వంటి భారీ బడ్జెట్ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ప్రభాస్ సరసన నటించిన `రాజా సాబ్` కూడా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సాధారణంగా అగ్ర హీరోల సరసన నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే హీరోయిన్లు బెంగ పెట్టుకుంటారు.. కానీ ఈ ప్రభాస్ బ్యూటీ మాత్రం గెలుపోటములతో సంబంధం లేకుండా జీవితాన్ని న‌చ్చిన‌ట్టు ఆస్వాధిస్తూ ముందుకు సాగుతోంది.

ప్రస్తుతం మాళవిక తన తదుపరి ప్రాజెక్టులపై గట్టి ఆశలే పెట్టుకుంది. కార్తీ సరసన నటిస్తున్న `సర్దార్ 2` ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ యాక్షన్ డ్రామా తన కెరీర్‌కు మళ్లీ ఊపునిస్తుందని భావిస్తోంది. దీనితో పాటు `పాకెట్ నవల`అనే మరో ఆసక్తికరమైన చిత్రంలోనూ నటిస్తోంది. వృత్తిపరమైన ఒడిదుడుకులు ఉన్నా.. నిరంతరం సోషల్ మీడియా ప్రమోషన్స్.. వెకేషన్స్ తో అభిమానులకు టచ్‌లో ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

అయితే ఈ విదేశీ పర్యటనల వెనుక ఒక చిన్న విమర్శ కూడా ఉంది. తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ పాపులారిటీ సంపాదించుకుంటున్న హీరోయిన్లు బాలీ, మాల్దీవులు, ఫిజీ వంటి విదేశీ దీవులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు కానీ.. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ బీచ్‌ల వైపు లేదా ఇత‌ర రాష్ట్రాల్లోని బీచ్ టూరిజం వైపు అస్స‌లు చూడటం లేదు. దేశంలోని సుదీర్ఘ బీచ్ ల‌లో అద్భుతమైన తీర ప్రాంతాలకు ఈ స్థాయి ప్రచారం లభిస్తే స్థానిక టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గట్టిగానే కృషి చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడానికి కొంత సమయం పట్టేలా ఉంది. అందాల కథానాయికలతో ఏపీ టూరిజానికి ప్రచారం చేయించే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. మన తారలు విదేశీ రిసార్టుల కంటే.. మన రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పిస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా.. పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.



Tags:    

Similar News