టాలీవుడ్ స్టార్లు విదేశీ షోలకు ఎందుకు దూరం?
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అమెరికాలో చేసిన షోలు ఎంతటి ఘనవిజయం సాధించాయో చూస్తే అక్కడ మార్కెట్ స్టామినా ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది.
టాలీవుడ్ స్థాయి ఇప్పుడు విశ్వవ్యాప్తం అయింది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి ఎదుగుతోంది. మన హీరోలకు ప్రపంచవ్యాప్తంగా... ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇంత క్రేజ్ ఉన్నా మన తెలుగు స్టార్లు విదేశాల్లో స్టేజ్ షోలు, నాటకాలు లేదా లైవ్ ఈవెంట్లు చేసి ఎందుకు ఆర్జించడం లేదు? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఇతర భాషల తారలు విదేశీ టూర్లతో కోట్లు గడిస్తున్న ఈ రోజుల్లో... మన స్టార్లు మాత్రం ఈ తరహా ప్రదర్శనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఎందుకనో!
ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అమెరికాలో చేసిన షోలు ఎంతటి ఘనవిజయం సాధించాయో చూస్తే అక్కడ మార్కెట్ స్టామినా ఏ రేంజులో ఉందో అర్థమవుతుంది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో నవాజుద్దీన్ చేసిన ఈ పాపులర్ షోలకు ఆడిటోరియాలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ యూఎస్ టూర్ ద్వారా నవాజుద్దీన్ బృందం రూ. 2 కోట్ల నుండి రూ. 3.5 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రదర్శన, ప్రయాణ ఖర్చులు పోనూ.. ఆయనకు ఒక్కో షోకు రూ. 15 నుండి 25 లక్షల చొప్పున... మొత్తం టూర్‌పై రూ. 1.5 కోట్లకు పైగా లాభం దక్కింది.
మరి నవాజుద్దీన్ లాంటి నటులకే అంత ఆదరణ ఉంటే.. తెలుగులో పాపులర్ స్టార్లకు ఆదరణ దక్కదా? అంటే కచ్చితంగా దక్కుతుంది. గతంలో మన అగ్ర హీరోలు విపత్తుల సమయంలో ఫండ్ రైజింగ్ కోసం విదేశాల్లో షోలు చేసి కోట్లాది రూపాయల నిధిని సేకరించిన ఘనత ఉంది. మరోవైపు మన మ్యూజిక్ డైరెక్టర్లు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, దేవీశ్రీ ప్రసాద్, థమన్, ఎం.ఎం. కీరవాణి లాంటి వారు విదేశాల్లో క్రమం తప్పకుండా లైవ్ కాన్సర్ట్‌లు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కానీ టాలీవుడ్ అగ్ర నటులు మాత్రం ఎందుకనో ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
దీనికి ప్రధాన కారణం.. టాలీవుడ్ స్టార్లకు ఉన్న డిమాండ్.. వారు తీసుకుంటున్న భారీ పారితోషికాలే! ప్రస్తుతం మన అగ్ర హీరోల రెమ్యునరేషన్ రూ. 30 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు ఉంది. పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడంతో హీరోల డైరీలు ముందుగానే ఫుల్ అయిపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న వీరికి... విదేశాలకు వెళ్లి నెలల తరబడి నాటకాలు లేదా లైవ్ షోల కోసం సమయం కేటాయించే పరిస్థితి, తీరిక ఏమాత్రం లేవు.
ఆర్థిక కోణంలో చూసినా ఇది వారికి లాభదాయకమైన విషయం కాదు. సినిమాల ద్వారా పదులు, వందల కోట్లు అందుకునే స్థాయికి చేరిన ఈ స్టార్లకు.. ఒక విదేశీ టూర్ లేదా షో కోసం అహర్నిశలు కష్టపడితే వచ్చే 5 లేదా 6 కోట్ల రూపాయల ఆదాయం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. లైవ్ షోల కోసం చేసే ప్రిపరేషన్, ప్రయాణాలకు వెచ్చించే సమయాన్ని సినిమాలకు పెడితే వారికి భారీ రాబడి వస్తుంది. అందుకే అత్యధిక ఆదాయం వస్తున్న చోట సమయాన్ని వెచ్చించడానికే టాలీవుడ్ స్టార్లు మొగ్గుచూపుతున్నారని స్పష్టమవుతోంది. కొందరు టాలీవుడ్ అగ్ర హీరోలు రజనీకాంత్ తరహాలో ఎథిక్స్ కోసం కోట్లాది రూపాయల విలువ చేసే వాణిజ్య ప్రకటనల కాంట్రాక్టుల్ని కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.