లలిత్ మోడీ కంటే ముందే టాప్ -5 వివాదాస్పద బయోపిక్స్
ఇప్పుడు ఇదే కోవలో ప్రముఖ నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సాజిద్ నడియాద్వాలా బ్యానర్‌లో మరొక సంచలన ప్రాజెక్ట్ రాబోతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో వివాదాస్పద వ్యక్తుల జీవిత చరిత్రలను తెరకెక్కించడం కొత్తేమీ కాదు. లలిత్ మోడీ కంటే ముందు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. అనేక రాజకీయ, ఆర్థిక, నేర వివాదాలతో ముడిపడి ఉన్న పలువురి ప్రముఖుల జీవితాలపై వచ్చిన బయోపిక్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వ్యవస్థను ధిక్కరించిన లేదా చట్టంతో పోరాడిన వ్యక్తుల కథలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ కోవలో మొదటిగా చెప్పుకోవాల్సింది ముంబై డాన్ హుస్సేన్ ఉస్త్రా జీవితం ఆధారంగా వచ్చిన చిత్రాలు. అలాగే అప్పట్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ల బయోపిక్‌లు. భారతదేశపు అత్యంత అపఖ్యాతి పాలైన స్టాక్ మార్కెట్ కుంభకోణాల సూత్రధారి హర్షద్ మెహతా జీవితం ఆధారంగా వచ్చిన `స్కామ్ 1992` వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్థిక ప్రపంచంలోని చీకటి కోణాలను, ఒక వ్యక్తి చేసిన మోసాలను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించి ఈ జోనర్‌కు సరికొత్త ప్రమాణాలను తెచ్చింది.
మరోవైపు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, గ్యాంగ్‌స్టర్ అరుణా గవలి జీవితం ఆధారంగా వచ్చిన డాడీ.. అలాగే రాజకీయ నాయకుల జీవితాలపై వచ్చిన `థాకరే` వంటి చిత్రాలు కూడా తీవ్ర వివాదాలను ఎదుర్కొన్నాయి. అలాగే హైదరాబాదీ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా, స్టూవర్డ్ పురం దొంగ కథ ఆధారంగాను బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. రాజకీయ, నేర సామ్రాజ్యాల మధ్య నడిచే నయవంచన, అధికారం కోసం జరిగే పోరాటాలను ఈ బయోపిక్‌లు కళ్లకు కట్టాయి. లలిత్ మోడీ బయోపిక్ రాకముందు ఈ తరహా చిత్రాలన్నీ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా.. ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాలు సాధించడం విశేషం.
ఇప్పుడు ఇదే కోవలో ప్రముఖ నిర్మాణ సంస్థ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సాజిద్ నడియాద్వాలా బ్యానర్‌లో మరొక సంచలన ప్రాజెక్ట్ రాబోతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వ్యవస్థాపకుడిగా.. దాని మాజీ కమిషనర్‌గా విశేష సేవలందించి ఆ తర్వాత అనేక వివాదాలు- పరిణామాలతో నిత్యం వార్తల్లో నిలిచిన లలిత్ మోడీ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఒక భారీ బయోపిక్ తెరకెక్కనుంది. లలిత్ మోడీ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ ప్రజలకు పూర్తిగా తెలియవని ఎన్నో అజ్ఞాత అంశాలన్నింటినీ ఈ సినిమా ద్వారా తెరపైకి తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇటీవలే లలిత్ మోదీ తనను గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ఏ విధంగా బెదిరించారో, క్రికెట్ బెట్టింగ్ గురించి ఎలాంటి ఒత్తిడి తెచ్చాడో కూడా వివరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నిటినీ పెద్ద తెరపై చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉందని.. రాయిటర్ తో పాటు ప్రొడ్యూసర్ స్నేహా రాజని కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యంగా ఉన్నారని సమాచారం.
అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటన వెలువడినప్పటి నుంచి ట్రేడ్ వర్గాల్లో.. నెటిజన్లలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. లలిత్ మోడీ అందరికీ తెలిసిన ప్రముఖ వ్యక్తి కావడం వల్ల ఈ సబ్జెక్ట్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందని కొందరు ట్రేడ్ నిపుణులు భావిస్తుండగా ఇటీవల బయోపిక్‌లపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు - నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానందున మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి చూడాలి. ఇంకా ఆరంభదశలో ఉన్న లలిత్ మోడీ బయోపిక్ సాజిద్ నడియాద్వాలా ప్రొడక్షన్ హౌస్‌ను మళ్లీ విజయాల బాట పట్టించి అగ్రస్థానానికి తీసుకువెళ్తుందో లేదో వేచి చూడాలి.