అనిరుధ్‌ను కాదని.. సాయిలో అట్లీ ఏం చూశాడు?

అట్లీ సాయిలో చూసింది కొత్త సౌండ్ అయ్యుండొచ్చు. సాయి ప్రైవేట్ పాటల్లో బీట్, మెలోడీ రెండూ యూత్‌కు త్వరగా చేరాయి. సినిమా పాటల ఫార్మాట్‌లోకి పూర్తిగా వెళ్లకముందే తనకంటూ ఓ స్టైల్ తెచ్చుకున్నాడు.

Update: 2026-09-19 04:34 GMT

స్టార్ హీరో సినిమా అంటే మ్యూజిక్ దగ్గర క్రేజ్ ఉన్న సేఫ్ పేర్లే వినిపిస్తాయి. అట్లీ గత సినిమాలు చూస్తే కూడా జీవీ ప్రకాశ్, ఏఆర్ రెహమాన్, అనిరుధ్‌లతోనే ఎక్కువగా పని చేశాడు. అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘రాకా’ మాత్రం ఆ పద్ధతికి భిన్నంగా వెళ్లింది. అప్పటికి సినిమా అనుభవం చాలా తక్కువగా ఉన్న సాయి అభ్యంకర్‌కు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడం డేరింగ్ నిర్ణయమే.

ఇప్పుడు ఆ నిర్ణయం వెనుక ఏం జరిగిందో అట్లీ చెప్పాడు. ‘రాకా’ కోసం అనిరుధ్, జీవీ ప్రకాశ్ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచించానని, చివరకు నిర్మాతతో మాట్లాడి సాయిని ఎంచుకున్నానని తెలిపాడు. అప్పటికి సాయి పేరు ‘కచ్చి సేరా’, ‘ఆస కూడ’లాంటి ఇండిపెండెంట్ పాటలతో బాగా వినిపిస్తోంది. కానీ భారీ స్టార్ సినిమాను పూర్తిగా హ్యాండిల్ చేసిన అనుభవం మాత్రం లేదు.

అట్లీ సాయిలో చూసింది కొత్త సౌండ్ అయ్యుండొచ్చు. సాయి ప్రైవేట్ పాటల్లో బీట్, మెలోడీ రెండూ యూత్‌కు త్వరగా చేరాయి. సినిమా పాటల ఫార్మాట్‌లోకి పూర్తిగా వెళ్లకముందే తనకంటూ ఓ స్టైల్ తెచ్చుకున్నాడు. సాయి కూడా గతంలో అట్లీ తనపై చాలా ముందుగానే నమ్మకం పెట్టుకున్నాడని చెప్పాడు. మొదటి సినిమా సైన్ చేయకముందే తనను పిలిచి ఒక ట్యూన్ వినిపించమన్నాడని గుర్తుచేశాడు. అప్పట్లో సాయి వయసు కూడా చాలా తక్కువే కావడంతో ఈ సెలక్షన్ అప్పుడే మరింత ధైర్యంగా కనిపించింది.

ఆ తర్వాత సాయి కెరీర్ కూడా వేగంగా మారింది. మొదట సైన్ చేసిన సినిమా ‘బెంజ్’ అయినా, విడుదలైన తొలి చిత్రం ‘డ్యూడ్’. ఆ తర్వాత సూర్య ‘కరుప్పు’తో పాటు మరికొన్ని పెద్ద సినిమాలు చేతికి వచ్చాయి. కానీ ‘రాకా’ స్థాయి మాత్రం వేరు. అల్లు అర్జున్ సినిమా కావడంతో పాటలకు డ్యాన్స్ బజ్ ఉంటుంది. అట్లీ సినిమాల్లో హీరో ఎంట్రీ, యాక్షన్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కూడా మ్యూజిక్ పెద్ద భాగమే.

సాయి ఇప్పటికే ‘రాకా’ కోసం చాలా ట్యూన్స్ తయారయ్యాయని చెప్పాడు. సినిమా మ్యూజిక్ భారతీయ మార్కెట్‌కే కాకుండా బయట ప్రేక్షకులకు కూడా చేరేలా ఉండాలని అట్లీతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించాడు. అల్లు అర్జున్‌కు మ్యూజిక్‌పై మంచి అవగాహన ఉందని, మొదట తన ట్యూన్స్ వినిపించే సమయంలో కొంచెం టెన్షన్ కూడా వచ్చిందని గతంలో చెప్పాడు.

ఇక ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్‌ను డిసెంబర్‌లో విడుదల చేసే ప్లాన్ ఉంది. దానికి ముందు పాట వస్తుందా లేక గ్లింప్స్‌తోనే సాయి మ్యూజిక్‌ను మొదట వినిపిస్తారా అన్నది ఇంకా చెప్పలేదు. అట్లీకి అనిరుధ్, జీవీ లాంటి తెలిసిన ఆప్షన్స్ ఉన్నా సాయిని ఎంచుకున్న కారణం ఇప్పుడు కొంత అర్థమవుతోంది. ఇక మొదటి పాట బయటకు వచ్చిన రోజే అట్లీ తీసుకున్న ఆ నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలుస్తుంది.

Tags:    

Similar News