యాటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ లేదు.. భార్య మీద వెంకీ ఫ్రస్ట్రేషన్
డైరెక్టర్ త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా నుంచి ప్రమోషన్ల జోరు మొదలైంది.
డైరెక్టర్ త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా నుంచి ప్రమోషన్ల జోరు మొదలైంది. నిన్నటి దాకా వెంకీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతో సందడి చేసిన మూవీ టీమ్, లేటెస్ట్ గా హీరోయిన్ కు సంబంధించిన మరో వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఒక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీజర్ ను కట్ చేసి జనాల ముందుకు తీసుకొచ్చారు.
ఈ వీడియోలో భార్యపై విసుక్కునే ఒక భర్తగా వెంకటేష్ కనిపిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి 'స్వర్ణ' అనే పాత్రలో నటిస్తోంది. ఈ వీడియోలో రఘుబాబుతో కలిసి నడుస్తూ వెంకీ చెప్పిన 'ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాట్యుట్యూడ్ ఉండదు' అనే డైలాగ్ భలేగా ఆకట్టుకుంటోంది. భార్యలు పెళ్లి ఫోటోల అప్పుడు మాత్రమే నవ్వుతారని, ఆ తర్వాత ఎప్పుడూ ముఖం మాడ్చుకునే ఉంటారంటూ వెంకీ చెప్పే డైలాగ్స్ సగటు భర్తలకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
సాధారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్, భార్యాభర్తల మధ్య ఉండే సరదా గొడవలను త్రివిక్రమ్ తనదైన తీరులో డీల్ చేస్తుంటారు. ఈ సినిమాలో కూడా వెంకటేష్ కామిక్ టైమింగ్ ను ఆయన పూర్తిగా వాడుకుంటున్నట్లు ఈ చిన్న గ్లింప్స్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇక శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే, ఆమె క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఉండనునట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో గ్లామరస్ ఇమేజ్ ఉన్న ఆమె, ఇందులో స్వర్ణ అనే ఒక హోమ్లీ రోల్ లో ఒదిగిపోయినట్లు తెలుస్తోంది.
వెంకీ లాంటి సీనియర్ హీరో పక్కన ఆమె పెయిర్ స్క్రీన్ మీద చాలా కొత్తగా సెట్ అయింది. పైగా వీడియోలో ఆమె ఎక్స్ప్రెషన్స్ కు, దానికి కౌంటర్ గా వెంకీ పడే ఫ్రస్ట్రేషన్ కు మంచి సింక్ కుదిరింది. కేవలం ఈ ఇద్దరే కాకుండా వీడియో చివర్లో సత్య లాంటి కామెడీ ఆర్టిస్టులు కూడా కనిపించడంతో సినిమాలో వినోదానికి ఎలాంటి లోటు ఉండదని మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు.
ఆదర్శ కుటుంబం ఏకే 47 హౌస్ నెం 47 అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఆ ఇంట్లో రోజూ ఒక చిన్నపాటి ఫ్యామిలీ యుద్ధం జరుగుతుందనే ఫీల్ ను ఈ ప్రోమోల ద్వారా జనాల్లోకి తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వీడియో చివర్లో మరోసారి క్లారిటీ ఇచ్చారు. నిన్న రిలీజ్ చేసిన వీడియోతో క్యారెక్టర్ డెప్త్ పరిచయం చేసిన మేకర్స్, ఈరోజు భార్య మీదున్న ఫ్రస్ట్రేషన్ తో నవ్వించి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. ఇక థియేటర్లలో ఈ ఆదర్శ కుటుంబం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.