త్రివిక్రమ్ కూడా అదే దారిలోనా?.. ఇండస్ట్రీలో హాట్ డిబేట్!

వీట‌న్నింటినీ చూస్తే, పాన్ ఇండియా మార్కెట్‌లో స‌క్సెస్ ను అందుకోవాలంటే డైరెక్ట‌ర్లు తమ ప్రెజెంటేషన్‌ను విస్తరించడం అనివార్యంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Update: 2026-07-28 06:50 GMT

పాన్ ఇండియా మార్కెట్ భారతీయ సినీ పరిశ్రమలో కథ చెప్పే విధానాన్నే మార్చేస్తోందనే అభిప్రాయం గత కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు రాసిన డైరెక్ట‌ర్లు, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రిప్ట్‌లను రూపొందిస్తున్నారు. ఈ మార్పు వల్ల కథల స్కేల్ పెరిగినా, స్థానిక సంస్కృతి, భాషా నేటివిటీ, చిన్న చిన్న ఎమోష‌న్స్ ప్రాధాన్యం కొంత మేర తగ్గుతోందనే డిస్క‌ష‌న్ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యూచ‌ర్ సినిమాల‌పై కూడా ఆసక్తికరమైన విశ్లేషణలు మొదలయ్యాయి.

త్రివిక్రమ్ పేరు వినగానే గుర్తొచ్చేది ఫ్యామిలీ బాండింగ్స్, నేచుర‌ల్ కామెడీ, చమత్కారమైన సంభాషణలు, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే క్యారెక్ట‌ర్లు. ఆయన సినిమాల్లో యాక్షన్ ఉన్నా, కథను ముందుకు నడిపేది ఎప్పుడూ ఎమోష‌న్సే. అందుకే ఆయన సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. అయితే ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్ తో భారీ ప్రాజెక్ట్‌ల వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఆయన కూడా తన కథన శైలిలో మార్పులు తీసుకొస్తారా అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఇటీవలి కాలంలో పలువురు డైరెక్ట‌ర్ల జ‌ర్నీని పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి తన కథలను గ్లోబ‌ల్ స్థాయికి తీసుకెళ్లేలా విజువల్ గ్రాండియర్‌కు పెద్దపీట వేశారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో మాస్ ఎలివేషన్స్, యాక్షన్, భారీ కాన్వాస్‌ను ప్రధాన బలంగా మలిచారు. సుకుమార్ కూడా స్థానిక నేపథ్యంతో కథ చెప్పినా, దాన్ని ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే స్థాయిలో ప్రెజెంట్ చేసే విధానాన్ని ఎంచుకున్నారు. సందీప్ రెడ్డి వంగా కథల్లో పాత్రల మానసిక సంఘర్షణలను మరింత బలంగా చూపిస్తూ, భారీ ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకుని నేరేషన్‌ను తీర్చిదిద్దారు.

వీట‌న్నింటినీ చూస్తే, పాన్ ఇండియా మార్కెట్‌లో స‌క్సెస్ ను అందుకోవాలంటే డైరెక్ట‌ర్లు తమ ప్రెజెంటేషన్‌ను విస్తరించడం అనివార్యంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అదే సమయంలో వారి అసలు శైలిని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ముఖ్యంగా త్రివిక్రమ్ విషయంలో ఈ సందేహం మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన స్ట్రెంగ్త్ ఎప్పుడూ ప్రేక్ష‌కుల గుండెల‌కు హ‌త్తుకునే సంభాష‌ణ‌లు, ఫ్యామిలీ ఎమోష‌న్స్, నేచుర‌ల్ క్యారెక్ట‌రైజేష‌న్లే త‌ప్పించి ఎప్పుడూ భారీ యాక్షన్ కాదు.

ప్ర‌స్తుతం వెంక‌టేష్ తో ఆద‌ర్శ కుటుంబం చేస్తున్న త్రివిక్ర‌మ్, ఆ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ సినిమాను చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. గాడ్ ఆఫ్ వార్ తో త్రివిక్ర‌మ్ త‌న కెరీర్లో మొద‌టిసారి పాన్ ఇండియా ను టార్గెట్ చేయ‌బోతున్నారు. అయితే పాన్ ఇండియా కోసం త్రివిక్రమ్ తన అసలు స్టైల్‌ను మార్చుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. కానీ త‌న స్టైల్ ను ఆయ‌న‌ పూర్తిగా పక్కన పెడతారని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. పెద్ద కాన్వాస్‌ను ఎంచుకున్నా, తన మార్క్ రైటింగ్, హ్యూమర్, ఎమోషనల్ టచ్‌ను కొత్త స్థాయిలో ప్రెజెంట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. గతంలో పలువురు డైరెక్ట‌ర్లు తమ శైలిని కోల్పోకుండా దానిని మరింత విస్తరించినట్లే, త్రివిక్రమ్ కూడా తెలుగు నేటివిటీని గ్లోబల్ స్కేల్‌లో ఆవిష్కరించే ప్రయత్నం చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే ప్రాజెక్ట్‌లు ఆయన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయా? లేక ఆడియ‌న్స్ అభిమానించే క్లాసిక్ త్రివిక్రమ్ శైలినే మరింత భారీ స్థాయిలో చూపిస్తాయా? అనే ఆసక్తి మాత్రం సినీ అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

Tags:    

Similar News