సోనమ్ హనీమూన్ మర్డర్ సినిమా టైటిల్ ఇదుగో..!
హనీమూన్‌కి అని భర్త రాజా రఘువంశీని తీసుకు వెళ్లి హత్య చేసిన సోనమ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అమ్మాయిలు మరీ ఇంత క్రూరంగా, రాక్షసంగా ఉన్నారా అని దేశం మొత్తం నివ్వెర పోయింది.;
హనీమూన్‌కి అని భర్త రాజా రఘువంశీని తీసుకు వెళ్లి హత్య చేసిన సోనమ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అమ్మాయిలు మరీ ఇంత క్రూరంగా, రాక్షసంగా ఉన్నారా అని దేశం మొత్తం నివ్వెర పోయింది. ఆ హత్య కేసు తన మీదకు రాకుండా చేసుకునేందుకు ఆమె వేసిన ప్లాన్ సినిమా కథకు తీసి పోదు అనడంలో సందేహం లేదు. ఆమె సుదీర్ఘ కాలం పాటు వేచి చూసి, పక్కా ప్లాన్ ప్రకారం రాజా రఘువంశీని హత్య చేసింది. ఒక ప్లాన్ విఫలం అయితే మరో ప్లాన్ అన్నట్లుగా ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి, తనతో పాటు ప్రియుడు, అతడి గ్యాంగ్‌ను తీసుకు వెళ్లి, అదును చూసి మరీ భర్త రాజా ను చంపించిన సోనమ్ పై సినిమా రాబోతుంది. మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై సినిమాను తీస్తున్నారు.
హనీమూన్ ఇన్ షిల్లాంగ్ టైటిల్ లోగో విడుదల
ఎస్ పీ నింబావత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' అనే టైటిల్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. టైటిల్ లోగో రక్తంతో తడిసి ఉండటంతో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. టైటిల్ లోగోను చనిపోయిన రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రిలీజ్ చేశాడు. పెళ్లికి ముందు నుంచి ఏం జరిగింది, రాజా రఘువంశీ స్వభావం ఏంటి అనే విషయాలను ఈ సినిమాలో ప్రస్థావించబోతున్నారు. అలాగే సోనమ్ ఫ్యామిలీ నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని, ఆమె గురించిన మరిన్ని విషయాలను సినిమాలో చూపించబోతున్నట్లు మేకర్స్ ద్వారా సమాచారం అందుతోంది. సినిమాలో చాలా వరకు రియల్ లొకేషన్స్‌ను వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
హత్య కేసు దోషిగా సోనమ్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం మాత్రమే కాకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న కుర్రాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేసిన ఘటన ఇది. మన దేశంలోనే కాకుండా ఈ కేసు గురించి విదేశాల్లోనూ చర్చ జరిగింది. పెళ్లి ఇష్టం లేకుంటే వదిలేసి వెళ్లి పోవాలి, పెళ్లి చేసుకున్న వాడు ఇష్టం లేకుంటే అతడిని వదిలేయాలి. అంతే కాని ఇలా చంపేస్తే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కారణం వల్ల చేసిన తప్పు బయటకు వస్తుంది. సోనమ్ హీరోయిన్ స్థాయిలో యాక్టింగ్ చేసినా కూడా పోలీసులు తమకు ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఆమెను దోషిగా గుర్తించారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేందుకు ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది.
రాజా రఘువంశీగా ఎవరు నటిస్తారు
ఇలాంటి రియల్ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమాలకు మంచి రీచ్ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్‌లను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆమధ్య కేరళకు సంబంధించిన ఒక కేసుపై ప్రముఖ ఓటీటీ లో వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన వచ్చింది. అందుకే ముందు ముందు ఇలాంటి రియల్ క్రైమ్ థ్రిల్లర్‌లు మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాలో రాజా రఘు వంశీగా ఎవరు నటించబోతున్నారు, సోనమ్ పాత్రకు ఎవరిని తీసుకోనున్నారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇదే ఏడాదిలో షూటింగ్‌ను ప్రారంభించి, వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు నింబావత్ సన్నిహితులతో చెప్పుకొచ్చారు.