గాంధీజీపై సినిమాలు పట్టించుకోని ప్రజలు!
ఆయన నిజంగా గొప్పవాడా, లేదా ఆయనను తీర్చిదిద్దిన యుగం- పరిస్థితులు గొప్పనా? అయితే అక్టోబర్ 02 గాంధీ జయంతి 2025 సందర్భంగా ఆయనపై సినిమాల జాబితాను పరిశీలిస్తే....!;
ప్రజలు గొప్పవారు కాదు.. పరిస్థితులే గొప్పవి! నిజానికి పరిస్థితులకు అనుగుణంగా మెలిగేవాడే గొప్పవాడు. అలాంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన నిజంగా గొప్పవాడా, లేదా ఆయనను తీర్చిదిద్దిన యుగం- పరిస్థితులు గొప్పనా? అయితే అక్టోబర్ 02 గాంధీ జయంతి 2025 సందర్భంగా ఆయనపై సినిమాల జాబితాను పరిశీలిస్తే....!
మానవత్వం అంతమైన సమాజంలో భారతదేశం తీవ్రమైన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జన్మించారు. హింసను ఆశ్రయించడం సులభం అయిన సమయంలో ఆయన అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవితాన్ని ఆయన అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాలాసార్లు తెరపై చిత్రీకరించారు. ప్రతి సినిమా గాంధీజీ పాత్ర చిత్రణ ఆయనలోని విభిన్న కోణాన్ని వెలికితీస్తుంది. 1982లో తీసిన `గాంధీ`లో బెన్ కింగ్ స్లే మహాత్మా గాంధీజీ పాత్రకు తెరపై ప్రాణం పోశారు. ఆయన నటనకు ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డు లభించింది. ఆ చిత్రం ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ బాల్యంపై దృష్టి సారించి తెరకెక్కించిన `ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా` చిత్రంలో రజిత్ కపూర్ టైటిల్ పాత్రను పోషించారు. ఈ పాత్ర రజిత్ కపూర్ కు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును సంపాదించిపెట్టింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంపై కేంద్రీకృతమై 1993లో వచ్చిన `సర్దార్` చిత్రంలో అన్ను కపూర్ ఎంకే గాంధీగా నటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పై మహాత్మా గాంధీ ప్రభావాన్ని చిత్రీకరించడంలో అన్ను కపూర్ ముఖ్యమైన సహాయక పాత్ర పోషించారు.
కమల్ హాసన్ దర్శకత్వం వహించిన `హే రామ్`(2000) చిత్రంలో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా మహాత్మా గాంధీ పాత్రను పోషించారు. ఈ చిత్రం గాంధీజీ పాత్రను సంక్లిష్టంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా అల్లకల్లోల కాలంలో ఆయన ఎలా ఉన్నారో చూపించింది.
`లగే రహో మున్నా భాయ్`(2006)లో దిలీప్ ప్రభావల్కర్ MK గాంధీ కల్పిత వెర్షన్ పాత్రను పోషించాడు. హీరో ఆలోచనలకు మార్గదర్శక వ్యక్తిగా అతడు కనిపించాడు. ఈ చిత్రం ఆధునిక సమాజంలో గాంధీ సూత్రాలు వర్కవుట్ అవుతాయా లేదా అనే నిరంతర ఔచిత్యాన్ని సృజనాత్మకంగా హైలైట్ చేసింది.
`గాంధీ, మై ఫాదర్`(2007) చిత్రంలో దర్శన్ జరివాలా మహాత్మా గాంధీని ఒక వివాదాస్పద తండ్రిగా చిత్రీకరించాడు. తన పెద్ద కుమారుడు హరిలాల్ తో ఆయనకున్న సంబంధాన్ని తెరపై చూపించారు. ఈ చిత్రం ఎంకే గాంధీ పాత్రను కుటుంబంతో ఎలా ఉన్నారో ఆవిష్కరించింది.
మహాత్మా గాంధీని ప్రజల వ్యక్తిగా మాత్రమే కాకుండా వ్యక్తిగత- చారిత్రక పరిస్థితులను నడిపించే వ్యక్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే- `గాంధీ- మై ఫాదర్` అర్థవంతమైన చూడదగిన సినిమా. మహాత్ముని సినిమాలను చూసి వాటి నుంచి నేర్చుకోవాల్సిన తరుణమిది.
ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలో గాంధీజీ పాత్ర అసలు కనిపించడం లేదు. ఆయనపై సినిమాలు లేవు. ఆయనను గుర్తుంచుకున్న వారు కూడా లేరు.