మాధురీ దీక్షిత్ మ్యాజిక్: మస్కారా పాటకు సరికొత్త అందం!
తాజాగా ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన `మెయిన్ వాపస్ ఆవుంగా` చిత్రం లోని `మస్కారా` అనే ఆకర్షణీయమైన పాటకు మాధురీ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురీ దీక్షిత్ అద్భుతమైన నృత్య ప్రతిభతో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎంత కాలం గడిచినా? ఆమె అభినయంలోని గ్రేస్, ముఖంలో కనిపించే హావభావాలు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కిన `మెయిన్ వాపస్ ఆవుంగా` చిత్రం లోని `మస్కారా` అనే ఆకర్షణీయమైన పాటకు మాధురీ తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ పాటకు సంబంధించిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పాటను అనుసరించి స్టెప్స్ వేయడమే కాకుండా ఆ పాటలోని చమత్కారమైన .. రొమాంటిక్ మూడ్‌ను మాధురి తన సిగ్నేచర్ హావభావాలతో అద్భుతంగా పండించారు. ముఖ్యంగా మాధురి దీక్షిత్ సొగసైన చేతుల కదలికలు, కనుబొమ్మల అభినయం చూసేవారిని కట్టిపడేస్తున్నాయి. దశాబ్దాలుగా నృత్య రంగంలో మాధురి సాధించిన అనుభవం ఆ ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
'మస్కారా' పాట విషయానికి వస్తే దీనిని చిత్ర బృందం ఎంతో శ్రావ్యంగా రూపొందించింది. అందమైన పాటకు నీలాంజన ఘోష్ దస్తీదార్ -యువ నటుడు, గాయకుడు వేదాంగ్ రైనా కలిసి మధురమైన గొంతుతో ప్రాణం పోశారు. ఇద్దరి గాత్రం పాటకు ప్రత్యేకమైన వైబ్‌ను తీసుకొచ్చింది. పాటలోని రిథమ్, సంగీతం యువతను ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇంతియాజ్ అలీ చిత్రాల ప్రత్యేకతే విభిన్నమైన సంగీతం ..భావోద్వేగాల కలయిక. ఆయన సినిమాల్లోని పాటలు ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇస్తాయి. `మెయిన్ వాపస్ ఆవుంగా`చిత్రంలోని మస్కారా పాట కూడా అదే కోవలో నిలుస్తోంది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా మాధురి దీక్షిత్ స్టెప్ తో పాట తారాస్థాయికి చేరుతుంది. సోషల్ మీడియా వేదికగా మాధురీ దీక్షిత్ షేర్ చేసిన వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. నేటి తరం నటీమణులు సైతం ఆశ్చర్యపోయేలా మాధురి డ్యాన్స్ రీల్స్ అభిమానులను కనువిందు చేస్తున్నాయి. సీనియర్ నటి అయినా? కొత్త తరహా ట్రెండ్స్‌కు తగ్గట్టుగా తనను తాను మలచుకుంటూ ప్రేక్షకులను అలరించడంలో ఆమె ఎప్పుడూ ముందే ఉంటారనడానికి మరోసారి నిరూపించారు.