'లిటిల్ హార్ట్స్' 500K+.. బాబోయ్ ఏంటి ఈ రచ్చ!
పెద్ద సినిమాలతో కలిసి విడుదలైన చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఘాటీ, మదరాసి సినిమాల కారణంగా మొదటి రోజు పెద్దగా జనాలు ఈ సినిమా గురించి మాట్లాడిందే లేదు.;
పెద్ద సినిమాలతో కలిసి విడుదలైన చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. ఘాటీ, మదరాసి సినిమాల కారణంగా మొదటి రోజు పెద్దగా జనాలు ఈ సినిమా గురించి మాట్లాడిందే లేదు. కానీ ఎప్పుడైతే సినిమా విడుదలై పాజిటివ్ టాక్ మొదలైందో, సోషల్ మీడియాలో సినిమా గురించి మౌత్ టాక్ ప్రారంభం అయిందో వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. సినిమాకు చేసిన విభిన్న ప్రచారం కారణంగా పెద్ద సినిమాల మధ్య కూడా సేఫ్‌గానే రిలీజ్ అయింది. మొదటి రోజు దాదాపుగా రూ.1.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. అంతా కొత్తవారే అయినప్పటికీ ఆ స్థాయి వసూళ్లు రాబట్టడం చాలా గొప్ప విషయం. రెండో రోజు దాదాపుగా డబుల్ వసూళ్లు వచ్చాయి. వీక్ డేస్ అని కూడా వదిలి పెట్టుకుండా చాలా చోట్ల హౌస్ ఫుల్ కావడంతో పాటు, చాలా థియేటర్ లు 80 శాతం కు మించి ఆక్యుపెన్సీ సాధించాయి. మొదటి వారం పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా రూ.22 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
బుక్ మై షో లో 5 లక్షల టికెట్లు బుక్
తాజాగా ఈ సినిమా బుక్ మై షో ద్వారా ఏకంగా 5 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి అంటూ అధికారికంగా ప్రకటించారు. చిన్న సినిమాకు బుక్ మై షో ద్వారా ఈ స్థాయిలో టికెట్లు బుక్ కావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. చిన్న సినిమాలకు మంచి టాక్ వచ్చినా థియేటర్ కు వెళ్లి టికెట్లు తీసుకుని సినిమాను చూడటం పరిపాటిగా వస్తూ ఉంటుంది. కానీ లిటిల్ హార్ట్స్ సినిమాకు మాత్రం వారం రోజుల్లోనే కేవలం బుక్ మై షో ద్వారా 5 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి, ఇతర ప్లాట్ ఫామ్ ద్వారా, థియేటర్ విండో వద్ద మరో అయిదు లక్షలు, అంతకు మించి టికెట్లు అమ్ముడు పోయి ఉంటాయి. ఈ రచ్చ చూస్తూ ఉంటే మామూలుగా లేదు అని బాక్సాఫీస్ వర్గాల వారు కూడా బుర్ర గోక్కుంటున్నారట. ఈ లెక్కలు ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులకు మరింత బూస్ట్‌ను ఇస్తున్నాయి. అంతే కాకుండా ప్రేక్షకుల్లో చూడాలనే ఆసక్తిని సైతం రేకెత్తిస్తోంది.
లిటిల్ హార్ట్స్ సినిమాకు రెండో వారంలో మరిన్ని థియేటర్‌లు
ఇది రెండు వారాలు నడిచి పోయే సినిమా కాదని, కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు థియేటర్‌లో ఉండే సినిమా అని నిర్మాతలు, బయ్యర్లు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమాను మరింత మందికి చేరువగా తీసుకు వెళ్లేందుకు గాను కొత్తగా మరికొన్ని థియేటర్లను యాడ్ చేయబోతున్నట్లు బన్నీ వాసు స్వయంగా చెప్పుకొచ్చాడు. మెట్రో నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఎక్కువగా విడుదలైన ఈ సినిమా వచ్చే వారం నుంచి చిన్న పట్టణాలకు, మేజర్ గ్రామ పంచాయితీలకు సైతం ఈ సినిమా చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సినిమా ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది చిత్ర యూనిట్ సభ్యుల నమ్మకం. ఈ వారం మిరాయ్, కిష్కింధాపురి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా లిటిల్ హార్ట్స్ సినిమా నడిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
మౌళి, శివాని నాగారం జంటగా
90s బయోపిక్‌తో గుర్తింపు దక్కించుకున్న నటుడు మౌళి, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని నాగారం జంటగా రూపొందిన ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. 90s బయోపిక్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈటీవీ విన్ ఒరిజినల్ నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమాను ఓటీటీ కోసం అనే తీశారు. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయాలి అనుకున్నారు. కానీ బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను కొనుగోలు చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయితే మంచి వసూళ్లు నమోదు చేస్తుందని వంశీ నందిపాటి నమ్మి బన్నీ వాసును ఒప్పించి విడుదల చేసేందుకు ఒప్పించాడని తెలుస్తోంది. మొత్తానికి ఒక మంచి సినిమాకు పెద్దల సహకారం కూడా తోడ్పాటు కావడంతో భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులు ఒక మంచి ఎంటర్‌టైన్ మూవీని ఆస్వాదిస్తున్నారు.