లిటిల్ హార్ట్స్ హీరో కొత్త ఛాలెంజ్
ఈ రోజుల్లో ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే దానికి కథ ముఖ్యం. కథ, అందులోని కంటెంట్ ఆడియన్స్ ను రీచ్ అయినప్పుడే సినిమాలు ఆడుతున్నాయి;
ఈ రోజుల్లో ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే దానికి కథ ముఖ్యం. కథ, అందులోని కంటెంట్ ఆడియన్స్ ను రీచ్ అయినప్పుడే సినిమాలు ఆడుతున్నాయి. లేదంటే ఎంత పెద్ద స్టార్ సినిమాలైనా సరే ఫ్లాపులు, డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. కథ ఉంటే పోటీలో పెద్ద సినిమాలున్నా సరే వాటికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ గా అలాంటి ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
ఘాటీ, మదరాసిలను దాటి సక్సెస్
అదే లిటిల్ హార్ట్స్. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మొదటి నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. అదే రోజున లిటిల్ హార్ట్స్ తో పాటూ అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి సినిమాలు రిలీజైనా కేవలం ఈ ఒక్క సినిమాకే ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను కేవలం ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా చూసి చిత్ర యూనిట్ ను అభినందిస్తున్నారు.
లిటిల్ హార్ట్స్ పై నాని ప్రశంసలు
అందులో భాగంగానే టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా లిటిల్ హార్ట్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్.. ఎంతో హాయిగా, సరదాగా ఉండే మూవీ.. చాలా కాలం తర్వాత హార్ట్‌ఫుల్ గా నవ్వుకున్నా. అఖిల్, మధు,కాత్యాయని (స్పెల్లింగ్ గురించి నాకు సరిగ్గా తెలీదు), మీరంతా నా రోజును వండర్‌ఫుల్ గా మార్చారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పను కానీ ప్రస్తుతానికైతే థాంక్యూ అంటూ పోస్ట్ చేశారు నాని.
నా వర్క్ గురించి తెలిశాకే కలుద్దామనుకున్నా
లిటిల్ హార్ట్స్ గురించి నాని రివ్యూ చూసి ఎగ్జైట్ అయిపోయారు మౌళి. దానిక్కారణం నాని అంటే మౌళికి చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతను రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కూడా చెప్పారు. తను నటించిన సినిమా బావుందని ఏకంగా ఫేవరెట్ హీరోనే చెప్పేసరికి మౌళి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాని పోస్ట్ కు మౌళి రిప్లై ఇస్తూ, చాలా థాంక్స్ నాని అన్నా, నీకు తెలియకపోవచ్చు కానీ పిల్ల జమీందార్ నుంచి నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ను. ఈ సినిమా కంటే ముందే మిమ్మల్ని కలుద్దామనుకున్నా కానీ నేనొక ఫ్యాన్ లా కాకుండా నా వర్క్ మీకు తెలిశాకే కలుద్దామని ఫిక్స్ అయి, దాని కోసం కష్టపడ్డా, ఈ రోజు కొట్టా. మౌళి ఎప్పటికీ నాని డై హార్డ్ ఫ్యానే. ఇవాళ కొత్త ఛాలెంజ్ పెట్టుకున్నా. ఏదొక రోజు నీ గోడలో ఇటుక అవుతా పక్కా అంటూ రాసుకురాగా, ప్రస్తుతం మౌళి చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
మౌళి కోరిక తీరేనా?
అయితే మౌళి నీ గోడలో ఇటుక అవుతా అనే మాట వాడటానికి ఓ రీజనుంది. నాని గతంలో తన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఒకదానిలో తాను ఓ స్ట్రాంగ్ గోడను నిర్మిస్తున్నానని, అందులో ప్రతీ ఇటుకా ఓ పెద్ద డైరెక్టర్ అని పేర్కొన్నారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నాని ఓ బ్యానర్ ను నిర్మించి అందులో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కొత్త డైరెక్టర్లను నాని ఇండస్ట్రీకి పరిచయం చేయగా, ఇప్పుడు మౌళి కూడా నాని గోడలో ఓ ఇటుకగా మారాలనుకుంటున్నారు. మౌళి కేవలం యాక్టర్ మాత్రమే కాదు, రైటర్, డైరెక్టర్ కూడా అనే సంగతి అందరికీ తెలుసు. లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్ లో మౌళి తానొక కామెడీ జానర్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నానని కూడా చెప్పడంతో మౌళి కోరిక తీరుతుందా? నాని బ్యానర్ లో మౌళి డైరెక్టర్ గా సినిమా చేస్తారా అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా మారింది.