లెడ్ ఆన్ గాంధీ: గాంధేయవాదంపై కమల్ హాసన్ దృక్పథం
విశ్వనటుడు కమల్ హాసన్ రూపొందించిన `లెడ్ ఆన్ గాంధీ` అనే డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ జీవితం, ఆయన సిద్ధాంతాలపై సరికొత్త చర్చకు దారితీసింది.;
విశ్వనటుడు కమల్ హాసన్ రూపొందించిన `లెడ్ ఆన్ గాంధీ` అనే డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ జీవితం, ఆయన సిద్ధాంతాలపై సరికొత్త చర్చకు దారితీసింది. ఈ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుతూ.. కమల్ హాసన్ అత్యంత వినమ్రంగా దీనికి అసలైన రచయిత హీరో మహాత్మా గాంధీ అని ప్రకటించారు. గాంధీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని.. తన జీవితాన్నే ఒక గొప్ప సందేశంగా మలిచిన మహనీయుడని కొనియాడారు. ఈ చిత్రం ద్వారా గాంధీజీ వదిలివెళ్ళిన ఉన్నతమైన ఆదర్శాలను నేటి తరానికి అందించడమే తన ప్రధాన ఉద్దేశమని కమల్ స్పష్టం చేశారు.
ఈ డాక్యుమెంటరీ నిర్మాణంలో కమల్ హాసన్ కేవలం ఒక నిర్మాతగానో.. నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎంతో లోతుగా నిమగ్నమయ్యానని తెలిపారు. చివరి నిమిషం వరకు ఎడిటింగ్ పనుల్లో స్వయంగా పాల్గొని.. గాంధీజీ ఆశయాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు. గాంధీ అనే పేరు కేవలం ఒక బిరుదుకో లేదా వారసత్వానికో పరిమితమైనది కాదని.. అది ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండాల్సిన ఒక గొప్ప ఆలోచన అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో కమల్ కి ఉన్న అంకితభావం గాంధేయవాదంపై అతడికి ఉన్న గౌరవాన్ని చాటిచెబుతోంది.
నేటి రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో గాంధీజీ విలువలు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో కమల్ హాసన్ నొక్కి చెప్పారు. ప్రస్తుత నాయకులు కేవలం ప్రసంగాలకు పరిమితం కాకుండా.. గాంధీజీ చూపిన శాంతి, అహింస , సత్యం వంటి విలువలను తమ జీవితంలో ఆచరించాలని అతడు పిలుపునిచ్చారు. గాంధీ సిద్ధాంతాలను సినిమా వంటి శక్తివంతమైన మాధ్యమం ద్వారా సామాన్యులకు చేరువ చేయడం వల్ల సమాజంలో ఒక సానుకూల మార్పు వస్తుందని అతడు నమ్ముతున్నారు. తరతరాలు మారుతున్నా.. గాంధీజీ ఆలోచనలు నేటికీ సమకాలీన సమస్యలకు పరిష్కారాలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.
నేటి కల్లోల పరిస్థితుల్లో సమాజానికి శాంతి - అహింస అనేవి అత్యంత అవసరమని ఈ డాక్యుమెంటరీ ద్వారా కమల్ హాసన్ గుర్తు చేశారు. గాంధీజీ పై కేవలం మాటల్లో గౌరవం చూపడం కంటే... ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని కమల్ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ కేవలం గాంధీ చరిత్రను చెప్పడమే కాకుండా.. మన బాధ్యతలను మనకు గుర్తు చేసే ఒక గొప్ప సందేశంగా నిలుస్తుంది. భవిష్యత్ తరాలు ఈ విలువలను పునాదులుగా చేసుకుని అభివృద్ధి చెందాలని కమల్ హాసన్ ఈ చిత్రం ద్వారా ఆకాంక్షించారు. ఎన్డీటీవీ తమిళనాడు సమ్మిట్ 2026 కార్యక్రమంలో కమల్ ఈ విషయాలపై మాట్లాడారు.