మాట నిలబెట్టుకున్న పవన్.. రివీల్ చేసిన లయ
తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ చిత్రాల్లోనే నటించి, అందం, అభినయం కలగలిపిన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి లయ.;
తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ చిత్రాల్లోనే నటించి, అందం, అభినయం కలగలిపిన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి లయ. స్వయంవరం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, మనోహరం, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ, స్వరాభిషేకం లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2006లో డాక్టర్ గణేష్‌ను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడిన లయ, సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
అపాయింట్‌మెంట్ లేకుండా పవన్ ను కలిసిన లయ
రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన లయ, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో లయ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటంతో పాటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించి మెగా ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తారు. అసలు లయకు, పవన్ కళ్యాణ్ కు ఏం సంబంధం? వారిద్దరూ కలిసి నటించింది కూడా లేదు కదా అనుకోవచ్చు. లయ తన పెళ్లి కోసమని పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేయడానికి కలిశారట. ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండానే తాను పవన్ కళ్యాణ్ ను కలిశానని, ఆయనకు తానెవరో పెద్దగా తెలియకపోవచ్చని, పిలిస్తే వస్తారా లేదా అనేది కూడా అనుమానం ఉందని, ఆ అనుమానంతోనే ఆయన్ను తన రిసెప్షన్ కు ఆహ్వానించినట్టు లయ గుర్తు చేసుకున్నారు.
మాట వరసకి అన్నారనుకున్నా
పవన్ ను కలవడానికి వెళ్లినప్పుడు అసలు తనను గుర్తు పడతారా లేదా అనుకుంటే, తనను ఆశ్యర్యపరుస్తూ, ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి మాట్లాడారని, శుభలేఖ అందుకున్న తర్వాత కచ్ఛితంగా వస్తానని చెప్పారని.. కానీ ఆయన ఆ టైమ్ లో ఏదో మాట వరసకి అలా వస్తానని చెప్పారనుకున్నానని, తీరా రిసెప్షన్ కు అందరికంటే ముందుగానే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా వచ్చారని చెప్పారు లయ.
ఆయన్ని చూసి షాకయ్యా..
పవన్ ను అక్కడ చూసి తాను షాక్ అయ్యానని, ఆయన అసలు రారనుకున్నానని, కానీ ముందుగా వచ్చి మమ్మల్ని సర్‌ప్రైజ్ చేశారని, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వచ్చి అతని ఆశీర్వాదాలు తమకు అందించారని, భోజనం చేసి వెళ్లమంటే నవ్వి, ఇంకెప్పుడైనా చూద్దాంలే అంటూ వెళ్లిపోయారని.. ఆయనకు తన పెళ్లికి రావాల్సిన అవసరం లేకపోయినా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చారని లయ చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ, ఆ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.