మీడియా తప్పుడు ప్రచారంపై నటి ఆవేదన!
సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో ఏదైనా విషయం దూకుడుగా దూసుకెళ్లడం చూస్తున్నాం.;
సోషల్ మీడియా - డిజిటల్ యుగంలో ఏదైనా విషయం దూకుడుగా దూసుకెళ్లడం చూస్తున్నాం. అందులో తప్పు ఒప్పుల గురించి ఆలోచించేంత సమయం కూడా ఉండటం లేదు. ప్రతి దానిలో నిజానిజాలను విచారించే ఓపిక కూడా ప్రజలకు లేదు. ఇలాంటి స్థితిలో ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
అయితే ఓ ప్రముఖ సహాయ నటి చేసిన వ్యాఖ్య నెటిజనుల్లో దుమారంగా మారింది. ఉలగనాయగన్ కమల్ హాసన్ పై సదరు నటీమణి చేసిన వ్యాఖ్య తనకు చిక్కులు తెచ్చి పెట్టింది. పాపులర్ తమిళ టెలివిజన్ రియాలిటీ షోలో పాల్గొన్న సదరు నటి తనకు కమల్ హసన్ పై చిన్నపాటి ప్రేమ ఉండేదని సరదాగా వ్యాఖ్యానించింది. ఓసారి ఆ విషయాన్ని స్వయంగా ఆయనకు చెప్పే ప్రయత్నం చేయగా, నువ్వు నాకు సోదరి లాంటిదానివి! అంటూ స్నేహితుల ముందు తన గాలి తీసేసారు అంటూ మాట్లాడింది. అయితే ఆ సమయంలో స్నేహితురాళ్ల మధ్య నవ్వుల పాలు అయ్యానని ఆమె సరదాగా చెప్పారు. ఇంతకీ ఈ నటి ఎవరు? అంటే... సహాయనటి లక్ష్మీ రామకృష్ణన్. తమిళ సినిమాల్లో పాపులర్ ఆర్టిస్టు. `విజయ్` టెలివిజన్ లో ఓ రియాలిటీ షోలో లక్ష్మీ పాల్గొని పైవిధంగా కామెంట్ చేసారు.
ఇలాంటివి సరదాగా చూడాలి:
అయితే ``కమల్ హాసన్ పై లవ్`` అంటూ సదరు నటీమణి గురించి సోషల్ మీడియాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై తిరిగి స్పందించిన సదరు నటీమణి .. ఉన్న విషయాన్ని మీడియా తప్పుగా చిత్రీకరించిందని, తాను సరదాగా అన్న మాటలను తప్పుగా ఎలివేట్ చేసారని వాపోయింది. సరదా సంగతుల్ని అర్థం చెడకుండా మీడియా ప్రజలకు చెప్పాలి.. ఇలా తప్పుగా ప్రచారం తగదు! అంటూ సీరియస్ అయింది.
16 వయసుకే...
నేను పదహారేళ్లకు నిశ్చితార్థం చేసుకున్నాను .. 18 వయసులో పెళ్లాడాను. 42 సంవత్సరాల వయస్సు వరకు సినిమా ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. నేను కేవలం ఒక సాధారణ అభిమానిని.. చిన్నపిల్లలా స్టార్లను వింతగా చూసేదానిని అని కూడా ఆమె తెలిపారు.
15ఏళ్ల కెరీర్ జర్నీలో...
నేను 45 వయసులో ఓ ప్రముఖ నటుడిని కలిసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. ఆయన నన్ను చూసి `నువ్వు నాకు సోదరి లాంటిదానివి` అని చెప్పినప్పుడు నా స్నేహితులలో నవ్వుల పాలు అయ్యాను అని తెలిపారు లక్ష్మీ. తాను జోక్ చేస్తే దానిని మీడియాలు సరదాగా తీసుకోకుండా సీరియస్ గా ప్రచారం సాగించాయని అన్నారు.
సరదా విషయాన్ని తప్పుగా అన్వయించడం అన్యాయం, అనాగరికం అని కూడా విమర్శించారు. నేటి మీడియా ఇలాంటి వాటిని రిపీట్ గా చెబుతూ, తప్పుగా ప్రచారం చేస్తోందని అన్నారు. దాదాపు దశాబ్ధంన్నర పైగానే సినీరంగంలో నటిగా కొనసాగుతున్న లక్ష్మీ రామకృష్ణన్ తమిళ చిత్రాలలో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇచ్చారు. నాన్ మహాన్ అల్లా, రౌథిరమ్, ఈసన్, ఎల్లం అవన్ సెయల్ తదితర చిత్రాలలో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకుంది.