కోలీవుడ్ లో కుబేర సంగతేంటి? శేఖర్ కమ్ముల ఏమన్నారంటే?
ఇప్పుడు కుబేర మాత్రం అనుకున్న స్థాయిలో వసూలు చేయడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నా.. రిలీజ్ అయ్యాక పరిస్థితి మారుతుందని అంతా అనుకున్నారు.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో కుబేర మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శేఖర్ కమ్ముల నిర్మాణంలో కూడా భాగమయ్యారు.
ప్రపంచంలోనే ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే ఓ పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే కుబేర మూవీ కాగా.. ఇప్పుడు సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన కుబేర.. బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లను సాధిస్తోంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది.
అదే సమయంలో కుబేర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా ధనుష్ అక్కడ హీరోనే కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆయన నటించే సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడతాయి.
ఇప్పుడు కుబేర మాత్రం అనుకున్న స్థాయిలో వసూలు చేయడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నా.. రిలీజ్ అయ్యాక పరిస్థితి మారుతుందని అంతా అనుకున్నారు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నా.. ఓవరాల్ గా మాత్రం కలెక్షన్స్ గెస్ చేసిన స్థాయిలో లేవు. వీకెండ్ పర్లేదనిపించినా.. ఇప్పుడు వసూళ్లు బాగా తగ్గినట్లు, అక్కడ నష్టాలు వస్తాయని వినికిడి.
ఇప్పుడు ఆ విషయంపై డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడారు. తెలుగులో మంచి వసూళ్లు సాధిస్తున్న కుబేర.. తమిళంలో మాత్రం ఎందుకలా చేస్తుందో తెలియడం లేదని అన్నారు. తానే షాక్ కు గురవుతున్నట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి తప్పుడు జరిగిందో తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నట్లు తెలిపారు.
కుబేర మూవీ స్టోరీ, ధనుష్ రోల్ కోలీవుడ్ సెన్సిబిలిటీస్ కు దగ్గరగానే ఉన్నాయని చెప్పారు. కుబేర లాంటి కథలను తమిళ ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని.. కానీ ఈసారి ఎందుకు అలా జరిగిందో తెలియడం లేదన్నారు. కుబేరకు వసూళ్లు తక్కువ రావడం వెనుక కారణమేంటో అర్థం కావడం లేదని శేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.