ధోనీ బంధువుతో హీరోయిన్‌ ప్రేమాయణం...!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ ప్రేమ విషయమై గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.;

Update: 2026-04-06 05:47 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ ప్రేమ విషయమై గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. కెరీర్‌ ఆరంభంలో ఈమె ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్‌ జాబితాలో ఈమె ముందు ఉంది అనడంలో సందేహం లేదు. అంతే కాకుండా పారితోషికం విషయంలోనూ ఈమె చాలా మంది హీరోయిన్స్‌తో పోల్చితే ముందు ఉంది. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో నిలిచిన కృతి సనన్ ప్రస్తుతం ప్రేమ వ్యవహారమై సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ మధ్య కాలంలో కృతి సనన్‌ సినిమాల కంటే ఆమె వ్యక్తిగత విషయాల విషయంలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. పైగా కృతి సనన్‌ ప్రేమిస్తున్న వ్యక్తి ఆమె కంటే దాదాపుగా 9 ఏళ్లు చిన్నోడు అనే విషయం ప్రధానంగా చర్చ జరుగుతోంది.

కబీర్‌ బహియాతో కృతి సనన్‌ ప్రేమాయణం...

కృతి సనన్‌ వయసు 35 కాగా, ఆమె ప్రేమిస్తున్న కబీర్‌ బహియా వయసు దాదాపుగా 26 ఏళ్లు అనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య వయసు తేడా 9 ఏళ్లు కావడంతో మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా తన భర్త నిక్ కంటే ఏకంగా పదేళ్లు పెద్ద వయసు అనే విషయం తెల్సిందే. ఇండస్ట్రీలోనే ఇదే విధంగా వయసు ఎక్కువ హీరోయిన్స్‌ తమ కంటే తక్కువ వయసున్న కుర్రాళ్లను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కృతి సనన్‌ వంతు వచ్చిందంటూ జాబితాను కొందరు బయట పెడుతున్నారు. వయసులో తనకంటే 9 ఏళ్లు చిన్న కుర్రాడితో కృతి సనన్‌ ప్రేమలో పడటంను కొందరు విమర్శిస్తూ ఉంటే, అతడి వ్యాపార సామ్రాజ్యం ను చూసి ప్రేమలో పడిందంటూ కొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి కృతి సనన్‌ ను రకరకాలుగా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్న వారు ఎక్కువ అయ్యారు.

ధోనీ ఫ్యామిలీ రిలేటివ్‌తో హీరోయిన్‌...

ఈ సమయంలోనే కృతి ప్రేమిస్తున్న కబీర్‌ బహియా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇతడు టీం ఇండియా మాజీ స్టార్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి బంధువు అవుతాడని తెలుస్తోంది. ధోనీ భార్య సాక్షి కి కబీర్‌ దగ్గర బంధువు అని బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇతడు సుదీర్ఘ కాలంగా ఇంగ్లాండ్‌లో ఉంటున్నాడు. అక్కడే ఇతడు వ్యాపారాలు చేస్తున్నాడు. ఇతడు ముఖ్యంగా ట్రావెల్‌ వ్యాపారంలో ఉన్నాడట. ఇంగ్లాండ్‌లోనే అతి పెద్ద ట్రావెల్‌ కంపెనీ యజమానిగా కబీర్‌ ను చెబుతున్నారు. అంతే కాకుండా ఇంకా పలు వ్యాపారాల్లోనూ కబీర్‌ కు భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇండియాకు అరుదుగా వస్తూ ఉండే కబీర్‌ తో కృతి సనన్‌ పరిచయం ఎక్కడ జరిగింది, అసలు ఇద్దరి మధ్య ఎలా ప్రేమ చిగురించింది అనే విషయాలు క్లారిటీ రావాల్సి ఉంది.

వరుస సినిమాలతో కృతి సనన్‌ బిజీ...

కబీర్‌ బహియా ఇప్పటి వరకు బహిరంగంగా తాను సాక్షి బంధువును అనే విషయాన్ని వెళ్లడించలేదు. అంతే కాకుండా బాలీవుడ్‌ మీడియాతోనూ ఆయన మాట్లాడిన సందర్భాలు ఎక్కువగా లేవు. ఆయన్ను అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్స్‌లో చూడటం మాత్రమే జరిగింది. కృతి సనన్‌ తో అతడు ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కృతి సనన్‌ పెళ్లికి కాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ప్రస్తుతానికి పెళ్లి గురించిన ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపై ఉంది అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక వైపు ప్రేమ విషయమై లీక్‌ లు ఇస్తూ తాను సింగిల్‌ కాదు అని చెప్పకనే చెబుతున్న కృతి మరో వైపు పెళ్లి విషయమై ఇప్పట్లో లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడంతో గందరగోళం క్రియేట్‌ అవుతోంది. వీరు ప్రేమలో ఉన్న విషయం వాస్తవం, అయితే వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News