క్రిష్ 4 .. ఇంకెన్నాళ్లు ఈ సస్పెన్స్?
ఇందులో క్రిష్ ఫ్రాంఛైజీలో నటించిన హీరోయిన్లు అందరూ కనిపిస్తారు. రేఖ, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా తిరిగి ఈ చిత్రంలో నటిస్తారని కథనాలొచ్చాయి.;
బ్లాక్ బస్టర్ క్రిష్ ఫ్రాంఛైజీలో నాలుగో భాగానికి గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ దర్శకత్వం వహిస్తాడని, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి మూడు భాగాలకు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. కానీ నాలుగో భాగానికి తనయుడు దర్శకత్వం వహిస్తాడని, ఈ చిత్రాన్ని అసాధారణ బడ్జెట్ తో రూపొందించేందుకు చాలా సమయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో హృతిక్ రోషన్ త్రిపాత్రాభినయం చేస్తూ, అత్యంత కీలకమైన దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. ఒక డెబ్యూ దర్శకుడుగా అతడు పది తలల రావణాసురుడిలా పని చేయాల్సి ఉంటుందని ఒక అంచనా.
అంతేకాదు ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజ్ లే ఉన్నాయి. ఇది ఒక టైమ్ ట్రావెల్ కథతో రూపొందనుంది. ఇందులో క్రిష్ ఫ్రాంఛైజీలో నటించిన హీరోయిన్లు అందరూ కనిపిస్తారు. రేఖ, ప్రీతి జింతా, ప్రియాంక చోప్రా తిరిగి ఈ చిత్రంలో నటిస్తారని కథనాలొచ్చాయి. అయితే ప్రియాంక చోప్రా తిరిగి వచ్చినా కానీ, ఈ చిత్రంలో ఒక కొత్త కథానాయిక నటించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అలాగే ప్రీతిజింతా, రేఖ రీఎంట్రీ గురించి ఇంకా చిత్రబృందం స్పష్ఠత నివ్వలేదు. వర్తమానం నుంచి భవిష్యత్ లోకి, భవిష్యత్ నుంచి వర్తమానంలోకి, గతంలోకి వెళ్లే క్రిష్ కి వీళ్లంతా దర్శనమిస్తారని భావిస్తున్నారు.
క్రిష్ 3 కోసం భారీ ఎత్తున వీఎఫ్ఎక్స్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు అంతకు మించి క్రిష్ 4 కోసం వీఎఫ్ఎక్స్ పనిని ఉపయోగిస్తారని తెలుస్తోంది. VFX కి అంకితమైన స్పెషల్ ఎఫెక్ట్స్ బృందంతో హై-ఆక్టేన్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రియాంక చోప్రా రీఎంట్రీ ఇస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హాలీవుడ్ లో పలు యాక్షన్ ఎంటర్ టైనర్లలో నటించిన పీసీ ఈ ప్రాజెక్టుకు ప్రధాన అస్సెట్ కానుందని భావిస్తున్నారు. అయితే ఈ భామ ఎంపిక గురించి ఇంకా రోషన్ లు అధికారికంగా ప్రకటించలేదు.