విజయవాడ రైల్వే స్టేషన్ లో కోటాను పట్టుకుని....!
కొన్ని తరాలకు సరిపడా పాత్రలను తన అద్భుతమైన నటనలో పండించి ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన నవరస నటనా భూషణుడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు.;
కొన్ని తరాలకు సరిపడా పాత్రలను తన అద్భుతమైన నటనలో పండించి ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన నవరస నటనా భూషణుడు పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు. ఆయనను బోర్న్ ఆర్టిస్ట్ గా చెప్పాలి. ఒక పాత్ర అన్నది మొదట రచయిత మెదడులో పురుడు పోసుకుంటుంది. దానికి దర్శకుడు మరింత వన్నె చేకూరుస్తారు. అది కాస్తా ఒక నటుడు చేతిలో పడ్డాక వారిద్దరి ఆలోచనలనూ అందుకుంటూ చేస్తే గొప్ప నటనగానే ఉంటుంది. అయితే ఆ పాత్రలను సృష్టించిన వారి ఊహలకు మించి చేస్తే అది జీవం పోసుకుంటుంది. శాశ్వతం అవుతుంది.
అలా పాత్రలకు జీవం పోసిన అతి కొద్ది మంది నటులలో కోటా శ్రీనివాసరావు ముందు వరసలో ఉంటారు. ఒక ఉత్తమనటుడికి ఉండాల్సింది మంచి ఆహార్యం, వాచకం, ఆంగీకం. కోటలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన గంభీరమైన గొంతుక ఆయన చేసే పాత్రలకు ఒక ఆస్తిగా చెప్పుకోవాలి. అంతే కాదు. ఆయన శరీరాకృతి ఎత్తు బరువు కూడా ఆయన పోషించిన పాత్రలకు తగినట్లుగానే మలచుకున్నారు.
అందుకే ఆయన ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయారు. కోటా సినీ రంగంలోకి ప్రవేశించిన కాలంలో పరిశ్రమ పరుగులు పెడుతోంది. స్వర్ణయుగం దాటి స్పీడ్ యుగంలోకి వడివడిగా దూసుకుపోతోంది. జనరేషన్ గ్యాప్ వల్ల పాత కాలం నటులు వెనుకబడ్డారు. దాంతో ఆ తరానికి ఆకట్టుకునేలా పాత్ర పోషణ చేస్తూ అందరినీ ఆకట్టుకోవాలంటే మాటలతో అయ్యే పని కాదు.
అయితే కోటా సినీ ఇండస్ట్రీకి కొత్త వారు అయినా నాటకాల ద్వారా తెరకు పాతవారే. అందుకే ఆయన తనకు దక్కిన ప్రతీ పాత్రను రక్తి కట్టిస్తూ ప్రేక్షకాభిమానాన్ని అనతికాలంలోనే అందుకున్నారు. ఇక కోటా 1978 లో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి పౌరాణికాలు లేవు, చారిత్రకాలు లేవు, జానపదాలు అంతకంటే లేవు. సాంఘికాలే ఉన్నాయి. అయినా సరే కోటా తన పరిధిలోనే పౌరాణికాలలోనూ మెరిసారు. గండిపేట రహస్యం అంటూ ఆయన మరో కొత్త అవతారాలను నటనలో చూపించారు.
ఇవన్నీ పక్కన పెడితే కోట రాజకీయ పాత్రలకు పెట్టింది పేరు ఆయన పోషించినన్ని రాజకీయ పాత్రలు బహుశా ఎవరూ పోషించి ఉండరేమో అని చెప్పాలి. అదే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా వచ్చిన సినిమాలలో ఆయనను అనుకరిస్తూ చేసిన పేరడీ సీమాలు కూడా కోటాకు ఎంతో పేరు తెచ్చాయి. అలా మండలాధీశుడు అన్న మూవీని ఆయన నటించారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ చూరగొంది.
అంతే కోటకు కష్టాలు నాటి నుంచి మొదలయ్యాయి. అప్పటికి సీఎం గా ఉన్న ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడటం కష్టం అనుకుంటే సినిమాలో ఆయన పాత్ర పేరడీగా చేసి పోషించడం అంటే మాటలు కాదు, దాంతో కోటకు ఒక సెక్షన్ పూర్తిగా వ్యతిరేకించింది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే పక్కన పెట్టేసింది.
ఆ సమయంలో ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్న కోటాను చుట్టుకుట్టి కొందరు ఆయనని నేలమీదకు లాగి మరీ కొట్టారు. దాంతో కోటాకి తన పాత్ర ప్రభావం ఎంత వరకూ ఉందో ప్రత్యక్షంగా అనుభవం పూర్వకంగా తెలిసింది. ఇదంతా కోట పలు మార్లు తన ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తెలుగు తేజాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. ఆయన పాత్రను ఆ సినిమాలో పేరడీగా పోషించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోయారు అని కోట చెప్పుకొచ్చారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు పడ్డారని చెబుతారు. పర భాషాల నుంచి నటీనటులను సాంకేతిక నిపుణులను టాలీవుడ్ కి తెచ్చి స్థానిక కళాకారుల పొట్ట కొడుతున్నారని ఆయన విమర్శలు చేసేవారు. మన వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇక చివరిగా ఆయన 2021లో జరిగిన మా ఎన్నికల్లో కూడా తాను ఎవరి పక్షమో వారికే ఎందుకు ఓటేస్తానో కుండబద్దలు కొట్టారు. ఏది ఏమైనా కోటా లాంటి విలక్షణ నటుడిని మళ్లీ చూడగలమా అంటే కాలమే జవాబు చెప్పాలి. ఆయన జీవిత శకం ముగిసింది కానీ వెండి తెర మీద ఆయన నట చూపించిన నట విన్యాసం ఎప్పటికీ నిత్య వసంతమై అలరారుతూనే ఉంటుందని గట్టిగా చెప్పక తప్పదు.