ప్రపంచంలోనే అరుదైన నటుడు కోటా
సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. సాధారణంగా హీరోలకు, హీరోయిన్స్‌కి అభిమానులు ఉంటారు;
సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మరణ వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు. సాధారణంగా హీరోలకు, హీరోయిన్స్‌కి అభిమానులు ఉంటారు. కానీ కోటా శ్రీనివాసరావుకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఆయన నటనను అభిమానించే వారు ఎక్కువ మంది ఉంటారు. సాధారణంగా ఒక నటుడు విలన్‌గా మెప్పించగలడు లేదంటే కమెడియన్‌గా నవ్వించగలడు. కానీ కోటా శ్రీనివాసరావు అత్యంత క్రూరమైన విలనిజం ను పండించడం తో పాటు, కడుపు పగిలి పోయేంతగా నవ్వించగలడు. అంతే కాకుండా కోటా సెంటిమెంట్‌తో కన్నీళ్లు తెప్పిస్తాడు, హర్రర్ సినిమాలతో భయపెట్టగలడు. ఇలా ఇన్ని రకాల పాత్రలు చేయడం కేవలం కోటాకు మాత్రమే చెల్లింది.
వందల సినిమాల్లో అత్యంత క్రూరమైన విలనిజంను పండించడం ద్వారా విలన్‌గా టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ ఇతర భాషల్లోనూ విలన్‌గా నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు చేరువయ్యాడు. విలన్‌గా ఎన్నో అవార్డులను, రివార్డ్‌లను సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావు అత్యధికంగా సినిమాలు చేసిన టాలీవుడ్ నటుడి జాబితాలో చేరాడు. విలన్‌గా కోటా శ్రీనివాసరావు నటించిన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో కోటా పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కోటా నటన వల్ల, ఆయన విలనిజం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
విలన్‌గా నటించిన కోటా శ్రీనివాసరావు కామెడీతోనూ మెప్పించాడు. బ్రహ్మానందం, బాబు మోహన్ తో కలిసి కోటా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబో కామెడీ సీన్స్ ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాల్లో ఉండేవి. వీరిద్దరి కాంబో కామెడీ ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా చూస్తూ నవ్వుకునే వారు ఎంతో మంది ఉంటారు. బాబు మోహన్ అన్నా అన్నా అంటూ కోటా శ్రీనివాసరావుతో చేసిన సినిమాలు అల్టిమేట్ కామెడీని పండించాయి. బ్రహ్మానందంతో కలిసి కూడా కోటా శ్రీనివాసరావు కామెడీ సీన్స్ చేసి నవ్వించాడు. అతడు సినిమాలో కోటా శ్రీనివాసరావు విలన్‌గా కనిపిస్తూనే తన మార్క్ డైలాగ్ డెలివరీతో నవ్వు తెప్పించాడు.
ఆడువారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించాడు. ఇంకా ఎన్నో సినిమాల్లోనూ సెంటిమెంట్‌తో మెప్పించాడు. హర్రర్ సినిమాలో షాకింగ్ రియాక్షన్ తో కోటా భయపెట్టిన సినిమాలు ఉన్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఇలా ఒకే నటుడు విలన్‌గా, కమెడియన్‌గా, సెంటిమెంట్ పాత్రలో, హర్రర్ పాత్రలో నటించిన దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే కోటా శ్రీనివాసరావు ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన నటుడు అనడంలో సందేహం లేదు. కోటా తెలుగు నటుడు అయినందుకు తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. చివరి రోజుల్లోనూ కోటా శ్రీనివాసరావు కెమెరా ముందుకు వచ్చి తన వంతుగా సినిమాలు చేశాడు. వీల్ చైర్ లో కూర్చుని మరీ నటించిన కోటా శ్రీనివాసరావు మృతి చెందడంను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.