పుట్టిన రోజు జరుపుకున్న 2 రోజులకే తుదిశ్వాస విడిచిన కోటా

నిజానికి ఆయన తెలుగువాడు కాకుండా.. ఉత్తరాదికి చెందిన నటుడైతే ఆయన ఎలివేషన్ మరోలా ఉందన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది;

Update: 2025-07-13 03:53 GMT

పరిచయం చేయాల్సిన అవసరం లేని తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు. నిజానికి ఆయన తెలుగువాడు కాకుండా.. ఉత్తరాదికి చెందిన నటుడైతే ఆయన ఎలివేషన్ మరోలా ఉందన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కర్కసమైన రాజకీయ నాయకుడిగా.. కసి పుట్టించే విలనిజాన్ని పండించాలన్నా కోటాకు మించినోళ్లు మరొకరు ఉండరు. తన గంభీరమైన గొంతును.. సెటిల్డ్ గా చేసే డైలాగ్ డెలివరీతో ఆయన పండించే విలనిజం నభుతో నభవిష్యతి అని చెప్పాలి.

ఓవైపు తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసే విలనిజాన్ని పండిస్తూనే..కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలు పోషించే టాలెంట్ కోటాకు సొంతం. ఆయన 83వ జన్మదిన వేడుకలు రెండు రోజుల క్రితమే (జులై 10న) చేసుకున్నారు. 83లోకి అడుగు పెట్టిన రెండు రోజులకే ఆయన తుదిశ్వాస విడవటం వేదనకు గురి చేస్తుందని చెప్పాలి. టాలీవుడ్ పరిశ్రమకు ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని చెప్పాలి. క్యారెక్టర్ నటుడిగా ఒక స్థాయిని సెట్ చేసుకోవటం కోటాకు మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. తన నటనతో సిల్వర్ స్క్రీన్ ను సుసంపన్నం చేసిన ఆయన లాంటి నటుడు మళ్లీ రారని మాత్రం చెప్పక తప్పదు.

తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడిగా కోటాను చెప్పాలి. రంగస్థలం నటుడిగా తన సత్తాను చాటిన ఆయన.. వెండితెర మీద తన నట విశ్వరూపాన్ని చూపారనే చెప్పాలి. సినిమాలో ఆయన ప్రదర్శించే విలనిజంతో ఆయనంటే రగిలిపోయేలా చేసిన టాలెంట్ ఆయన సొంతం. స్క్రీ న్ మీద ఆయన కనిపించే వేళ.. ఆయన నటనతో సాటి నటులకు మాత్రమే.. హీరోలను సైతం డామినేట్ చేయటం ఆయనకే చెల్లుతుంది.

టాలీవుడ్ లో ఎంతో మంది నటులు ఉండొచ్చు కానీ కోటాను రీప్లేస్ చేసే నటుడ్ని మాత్రం తీసుకురాలేదని చెప్పాలి. నవరసాల్ని ఇట్టే పలికించే ఆయన టాలెంట్ అరుదైనదిగా చెప్పాలి. కోటా శ్రీనివాసరావు విషయంలో ఒక అంశాన్ని ప్రస్తావించాలి. ప్రసార మాధ్యమాలు.. మరి ముఖ్యంగా టీవీ న్యూస్ చానళ్ల పుణ్యమా అని పలు సందర్భాల్లో ఆయన మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు వేసి.. ఆ తర్వాత నాలుకర్చుకున్న సందర్భాలెన్నో.

సాధారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే నటుడికి ప్రత్యేక గుర్తింపు.. గౌరవం పెద్దగా లభించదు. అయితే.. కోటా శ్రీనివాసరావు అందుకు మినహాయింపుగా చెప్పాలి. ఆయనకు మాత్రమే సాధ్యమైన మరో మేజిక్ ను ఇక్కడ ప్రస్తావించాలి. ఓవైపు విలన్ వేషాలు వేస్తూ.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ గా.. హాస్య నటుడిగా ఆయన నటించిన సినిమాల్లో బాబూమోహన్ కలిసిన పాత్రలు ప్రత్యేకమని చెప్పాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ కొన్నేళ్లు పాటు సాగింది. ఈ ఇద్దరు పలు జోనర్లలో కలిసి పని చేయటం వారికిమాత్రమే సాధ్యమవుతుందేమో. అలాంటి కాంబినేషన్ టాలీవుడ్ లో సాధ్యం కాదనే చెప్పాలి.

Tags:    

Similar News