సీనియర్ నటుడు కోట ఇప్పుడెలా ఉన్నారు?
కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు. విలన్ గా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా ఆయన పోషించని పాత్ర లేదు.;
కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు. విలన్ గా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా ఆయన పోషించని పాత్ర లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో దాదాపు 750 పైగా చిత్రాల్లో నటించిన కోట 9 రాష్ట్ర ప్రభుత్వ నందులు అందుకున్నారు. టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఆయన ఒకరిగా దశాబ్ధాల పాటు కొనసాగారు. అయితే కోట రెండేళ్లుగా బయట కనిపించడం లేదు. సినిమాల్లో నటించడం లేదు.
దీనికి కారణం ఆయన ప్రస్తుతం విరామ జీవితాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసారు. ''కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ ఫోటోగ్రాఫ్ లో కోట బాగా బక్క చిక్కి బలహీనంగా కనిపిస్తున్నారు. పైగా పాదానికి కట్టు కనిపించడంతో ఆయనకు గాయం అయిందని అర్థమవుతోంది. కోట వయసు 70 పైబడి ఉంది. వృద్ధాప్య సంబంధ సమస్యలకు అనారోగ్యం తోడైందని భావిస్తున్నారు. ఆయనను ఆరాధించే అభిమానులు కోటకు ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. మేటి నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.