కోటా ఇంటికొచ్చిన అరుదైన అవార్డులు ఇవే!

తెలుగు సినిమా చరిత్రలో అరుదైన నటుడిగా కోటా శ్రీనివాసరావు నిలిచి పోతారు. ఆయన నటించిన 750 సినిమాల్లో ఎన్నో సూపర్‌ హిట్స్ ఉన్నాయి;

Update: 2025-07-13 07:08 GMT

తెలుగు సినిమా చరిత్రలో అరుదైన నటుడిగా కోటా శ్రీనివాసరావు నిలిచి పోతారు. ఆయన నటించిన 750 సినిమాల్లో ఎన్నో సూపర్‌ హిట్స్ ఉన్నాయి. ఎన్నో గొప్ప పాత్రలను కోటా చేశారు. తనకు మాత్రమే సాధ్యం అనిపించేంత గొప్పగా నటించిన పాత్రలు చాలా ఉన్నాయి. ఆహా నా పెళ్లంట సినిమాలో లక్ష్మీపతి పాత్రలో కోటా శ్రీనివాసరావు కనిపించిన తీరు, ఆ పాత్ర కోసం ఆయన కనబర్చిన నటనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. ఇక వెంకటేష్ హీరోగా నటించిన గణేష్ సినిమాలో కోటా శ్రీనివాసరావు కనబర్చిన విలనిజంను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. 'ఆమె' సినిమాలో కోటా శ్రీనివాస్‌ నటనను మహిళ ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు.

నటుడిగా ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న కోటా శ్రీనివాసరావుకు కేంద్ర ప్రభుత్వం సైతం అవార్డులతో సత్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ పురస్కారం ను 2015 సంవత్సరంలో కోటా అందుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారంను కోటా శ్రీనివాసరావు అందుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కోటా శ్రీనివాసరావు పద్మశ్రీని అందుకున్నారు. పద్మ అవార్డును అందుకున్న అతి కొద్ది తెలుగు నటుల జాబితాలో కోటా శ్రీనివాసరావు చోటు దక్కించుకున్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన నంది అవార్డులను సైతం కోటా శ్రీనివాసరావు దక్కించుకున్నారు. కోటా ఇంటికి మొదటి నంది 1998లో అడుగు పెట్టింది. వెంకటేష్ హీరోగా రూపొందిన గణేష్‌ సినిమాలో క్రూరమైన విలనిజంను కనబర్చినందుకు గాను ఉత్తమ విలన్‌గా కోటా శ్రీనివాసరావుకు నంది అవార్డ్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఆ సినిమాలో ఆరోగ్య శాఖ మంత్రి సాంబశివరావు గా కోటా శ్రీనివాసరావు నటించారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో కోటా శ్రీనివాసరావు నటన సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత చిన్న సినిమాలోనూ విలన్‌గా నటించి ఆకట్టుకోవడంతో నంది అవార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

2002 సంవత్సరంలో ఉత్తమ సహాయ నటుడిగా 'పృథ్వీ నారాయణ' సినిమాకు గాను అందుకున్నాడు. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2004లో వచ్చిన 'ఆ నలుగురు' సినిమాలో కోటా శ్రీనివాసరావు నటనలోని షేడ్స్‌ ఆకట్టుకున్నాయి. కన్నీళ్లు తెప్పించడం తో పాటు, అతడిపై కోపం కూడా తెప్పించే విధంగా నటించాడు. దాంతో ఆ సినిమాకు గాను సహాయ నటుడిగా కోటా శ్రీనివాసరావు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డ్‌ను అందుకున్నాడు. చివరగా పెళ్లైన కొత్తలో సినిమాకు గాను కోటా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో వయసు పైబడిన వ్యక్తి పాత్రలో కోటా నటించి మెప్పించాడు. నంది పురస్కారాలు మాత్రమే కాకుండా మరెన్నో అవార్డ్‌లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

Tags:    

Similar News