సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. కానీ ఆ అమ్మాయి వల్ల!: కోన వెంకట్

టాలీవుడ్‌ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ తన జీవితంలో ఎదుర్కొన్న షాకింగ్ సంఘటన ఇటీవల వెల్లడించారు.;

Update: 2026-04-01 04:57 GMT

టాలీవుడ్‌ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ తన జీవితంలో ఎదుర్కొన్న షాకింగ్ సంఘటన ఇటీవల వెల్లడించారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే అదే సమయంలో ఎదురైన ఒక చిన్న సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని వివరించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

చెన్నైలో ఉన్న సమయంలో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన తాను 1997లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని కోన వెంకట్ తెలిపారు. ఆ సమయంలో సుమారు 50 నిద్రమాత్రలు కొనుగోలు చేసి, వాటిని తీసుకుని జీవితానికి ముగింపు పలకాలనుకున్నానని చెప్పారు. చివరికి తన వద్ద ఉన్న డబ్బులతో ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ నిర్ణయంతో చెన్నై బీచ్‌ కు వెళ్లిన ఆయన జీవితంలో ఊహించని మలుపు తిరిగింది.

అక్కడ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక చిన్నారి తన కంటపడిందని కోన వెంకట్ తెలిపారు. ఆ అమ్మాయికి రెండు కాళ్లు, చేతులు లేకపోయినా, తన తమ్ముడు తోసే బండిపై కూర్చుని బెలూన్లు అమ్ముతూ జీవితం కోసం పోరాడుతుండటం చూసి తాను కదిలిపోయానన్నారు. రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో కూడా ఆ చిన్నారి లైఫ్ సాగించడానికి ప్రయత్నించడం తనను లోలోపల కుదిపేసిందని చెప్పారు.

"ఆ అమ్మాయి పరిస్థితి చూసిన తర్వాత నేను ఎందుకు బతకలేను అనే ఆలోచన వచ్చింది. నా సమస్య ఎంత చిన్నదో అర్థమైంది. అప్పుడే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను" అని కోన వెంకట్ పేర్కొన్నారు. తన జీవితాన్ని కాపాడటానికి దేవుడే ఆ చిన్నారిని తన ముందుకు పంపాడని భావిస్తున్నానని అన్నారు. ఆ సంఘటన తర్వాత తిరిగి జీవితాన్ని సీరియస్‌ గా తీసుకుని, సినిమాల్లో తన ప్రయాణాన్ని కొనసాగించానని తెలిపారు.

తర్వాత కాలంలో ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ, నిర్మాతగా కూడా విజయాలు సాధించానని కోన వెంకట్ చెప్పారు. అయితే ఆ చిన్నారి గురించి మాత్రం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు. ఆమెను మరోసారి చూడాలని అనుకుని అనేకసార్లు చెన్నై బీచ్‌ కు వెళ్లి వెతికినా, మళ్లీ ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ఆ సంఘటన తన జీవితంలో ఒక పెద్ద మలుపు అని, ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

అయితే ఆ విషయాన్ని ఆయన తాజాగా జరిగిన బ్యాండ్ మేళం మూవీ థ్యాంక్యూ మీట్‌ లో అభిమానులతో పంచుకున్నారు. ఆ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌ పై కావ్య, శ్రావ్య నిర్మించారు. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆ చిత్రం. ఏదేమైనా కోన వెంకట్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News