సంక్రాంతి 'BMW'.. ఇద్దరి నమ్మకం నిలబెడుతుందా?
సినీ సంక్రాంతి సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.;
సినీ సంక్రాంతి సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ. జనవరి 13వ తేదీన ఆ సినిమా రిలీజ్ కానుండగా.. మేకర్స్ ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందిన ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓ పెళ్లయిన వ్యక్తి చుట్టూ తిరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందుతున్న మూవీలో కామెడీతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఫుల్ గా ఉంటాయని ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెబుతోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా రవితేజ టైమింగ్, డైలాగ్ డెలివరీ, కామెడీ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. అదే సమయంలో మేకర్స్ ప్రమోషన్స్ ను దూకుడుగా నిర్వహిస్తున్నారు. సినిమాపై బజ్ పెంచుతూనే ఉన్నారు. దీంతో భర్త మహాశయులకు విజ్ఞప్తిపై ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.
అయితే ఇప్పుడు సినిమాపై హీరో, డైరెక్టర్ భారీ ఆశలు పెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే రవితేజ హిట్ అందుకుని గ్యాప్ వచ్చేసింది. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత వరుసగా చేసిన సినిమాలు.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రాలు డిజాస్టర్లుగా మారడంతో మాస్ మహారాజా కెరీర్ పై సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
దీంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ.. రవితేజ తనకు మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు కిషోర్ తిరుమల.. ఇప్పటివరకు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి ఎమోషనల్ స్టోరీలతో మూవీలు చేసి యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు రవితేజ మూవీతో పూర్తి భిన్నమైన జానర్ లోకి అడుగుపెట్టి సినిమా చేశారు.
అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి.. కిషోర్ తిరుమల కెరీర్ లో కొత్త ప్రయత్నం. ఎమోషన్ జోనర్ నుంచి పూర్తిస్థాయి కామెడీ జోనర్ కు మారడం ఛాలెంజే. కానీ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు. అలా సినిమాపై అటు రవితేజ.. ఇటు కిషోర్ తిరుమల ఇద్దరూ గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. ఏదేమైనా హీరో, డైరెక్టర్.. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.